అవకాశమున్నా కరెంటివ్వలేని అసమర్థ ప్రభుత్వం!
రాష్ట్రంలో 27 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్తు సామర్థ్యం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం 20 వేల మెగావాట్ల పీక్ డిమాండ్‌ను తీర్చలేకపోయిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
- 27 వేల మెగావాట్ల సామర్థ్యమున్నా.. 20 వేల సప్లయ్కీ దిక్కులేదు
- అయినా మళ్లీ 7,800 మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేస్తరా?
- ఈఆర్సీ బహిరంగ విచారణలో బీఆర్ఎస్ అభ్యంతరాలు
- కొత్త లైన్లు వేయకుండా కొన్న విద్యుత్తు ఎట్ల సప్లయ్ చేస్తరు?
- తక్కువ ధరకు ఇచ్చే సెకీ, ఎన్టీపీసీని వదిలేసి.. టెండర్లు దేనికి?
- కొనుగోళ్ల పేరిట ప్రజలపై ట్రూఅప్ భారం మోపేందుకు కుట్ర
- కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 27 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్తు సామర్థ్యం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం 20 వేల మెగావాట్ల పీక్ డిమాండ్‌ను తీర్చలేకపోయిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉన్న విద్యుత్తును అందించే దిక్కులేదని, ఇంతటి అసమర్థ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తుండటం దౌర్భాగ్యకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనంగా 7,800 మెగావాట్ల విద్యుత్తు కొనుగోళ్లకు అనుమతి కోరుతూ విద్యుత్తు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) మంగళవారం బహిరంగ విచారణ జరిపింది. ఎర్రగడ్డలోని కార్యాలయంలో ఈఆర్సీ చైర్మన్ దేవరాజు నాగార్జున, సభ్యులు సీహెచ్ శ్రీనివాసరావు, రఘు ఈ విచారణ జరిపారు.
ఈ సందర్భంగా విద్యుత్తు కొనుగోళ్ల ఆవశ్యతను ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల సీఎండీలు జితేష్ వీ పాటిల్, వరుణ్‌రెడ్డి వివరించారు. అనంతరం బీఆర్ఎస్ తరఫున జగదీశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్రంలో రోజూ 24 గంటలపాటు 20 వేల మెగావాట్ల విద్యుత్తు సరఫరా చేయగలిగే పరిస్థితులున్నప్పటికీ రేవంత్‌రెడ్డి సర్కార్ విఫలమైందని ఆరోపించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడంలేదని, విద్యుత్తును కొనుగోలు చేసినట్టు చూపించి, ఆ తర్వాత ట్రూఅప్ చార్జీల పేరిట ప్రజల ముక్కుపిండి వసూలు చేసేందుకు సర్కార్ కుట్ర చేస్తున్నదని నిప్పులు చెరిగారు. డిస్కమ్‌లు సమర్పించిన ప్రతిపాదనలు ఈఆర్సీ తిరస్కరించాలని కోరారు.
సామర్థ్యమున్నా కోతలెందుకు?
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగినట్టు ప్రభుత్వం బిల్డప్ ఇస్తున్నదని, ఈ ప్రచారంలో వాస్తవం లేదని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. కొవిడ్‌కు ముందు 10 వేల మెగావాట్లుగా ఉన్న పీక్ డిమాండ్ ఆ తర్వాత 14 వేల మెగావాట్లకు పెరిగినప్పటికీ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెప్పపాటు కోతలు లేకుండా అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్తు అందించిందని గుర్తుచేశారు. గతంలో రాష్ట్రంలో 19,464 మెగావాట్ల స్థాపిత విద్యుత్తు సామర్థ్యం ఉన్నదని, బీఆర్ఎస్ హయాంలో ఎన్టీపీసీ నుంచి 1,600, యాదాద్రి నుంచి 3,200, సెకీ నుంచి 4,162 మెగావాట్ల గ్రీన్ పవర్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో రాష్ట్ర స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 26 వేల మెగావాట్లకు చేరిందని పేర్కొన్నారు. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 20 వేల పీక్ డిమాండ్‌ను ఎందుకు అధిగమించలేకపోతున్నదని ప్రశ్నించారు. వ్యవసాయం, పరిశ్రమలు సహా అన్ని రంగాలకు అడ్డగోలుగా విద్యుత్తు కోతలు విధిస్తుండటంతో రైతులు, ఇతర వినియోగదారులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ విద్యుత్తు కోతలపై సమగ్ర విచారణ జరుపాలని ఈఆర్సీని డిమాండ్ చేశారు.
ట్రాన్స్మిషన్ లైన్లు ఏవి?
రాష్ట్రంలో ఉన్న విద్యుత్తును ఇచ్చే దిక్కులేదని జగదీశ్‌రెడ్డి పేర్కొంటూ.. అదనంగా కొనుగోలు చేసే 7,800 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేసే వ్యవస్థ ఎక్కడున్నదని ప్రశ్నించారు. గత మూడేండ్లల్లో ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యాన్ని కిలోమీటర్ కూడా పెంచలేదని, ఈహెచ్‌టీ లైన్ వేయలేదని, సబ్‌స్టేషన్ కూడా కట్టకుండా అదనపు విద్యుత్తు సరఫరా చేయడం ఎలా సాధ్యమని నిలదీశారు. విద్యుత్తు కొనుగోళ్లపై ఉన్న ఆతృత సరఫరాపై ఎందుకు లేదని సర్కార్‌ను ప్రశ్నించారు. ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నా లేకున్నా విద్యుత్తు ప్లాంట్లకు చెల్లింపులు చేయక తప్పదని, ఈ భారం ప్రజలపైనే పడుతుందని పేర్కొంటూ.. దీనిపై ఈఆర్సీ ఆలోచించాలని కోరారు.
రూ.1.90కే దొరికే కరెంట్ ఎందుకు వద్దు?
రాత్రిపూట ఇంధన ఎక్సేంజీలో యూనిట్ రూ. 1.90కే దొరుతున్నదని, ఈ విద్యుత్తును ఎందుకు వినియోగించుకోవడంలేదని జగదీశ్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. గతంలో బీఆర్ఆర్ ప్రభుత్వం యూనిట్ రూ.2.50 చొప్పున 4 వేల మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు సెకీ, ఎన్టీపీసీతో పీపీఏలు కుదుర్చుకున్నదని గుర్తుచేస్తూ.. కాంగ్రెస్ సర్కార్ ఇదే తరహాలో పీపీఏలు కుదుర్చుకోకుండా విద్యుత్తు కొనుగోళ్లు చేయడమేందని నిలదీశారు. ఈ విషయాలను ఈఆర్సీ పరిగణనలోకి తీసుకుని సెకీ, ఎన్టీపీసీ లాంటి సంస్థల నుంచి తక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు.
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ (బెస్) ప్లాంట్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సరికాదని, జెన్కో, సింగరేణి ద్వారా బెస్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విండ్ పవర్‌పై పునరాలోచన చేయాలని కోరారు. కేంద్రప్రభుత్వ సంస్థలు రోజుకో రకం ఉత్తర్వులు జారీచేస్తున్నాయని, రెన్యువబుల్ ఎనర్జీని వినియోగించకుంటే జరిమానాలు విధిస్తామనడం సరికాదని చెప్పారు. థర్మల్ ప్లాంట్లలో విద్యుత్తు ఉత్పత్తికి 20% విదేశీ బొగ్గు వాడాలన్న నిబంధన గతంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకించిందని గుర్తుచేశారు. పవర్ పీక్ అవర్స్‌లో రెన్యువబుల్ ఎనర్జీ అందదని, థర్మల్ ప్లాంట్లు ఉండాల్సిందేనని, దీన్ని దృష్టిలో ఉంచుకునే యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెంలో 800 మెగావాట్ల పాంట్లు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
ఇష్టారాజ్యంగా కొనుగోళ్లేంది?
ఎనర్జీ సెక్యూరిటీ పేరుతో ఇష్టారీతిన కొనుగోళ్లు చేయడంపై విద్యుత్తు రంగ నిపుణుడు వేణుగోపాల్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస్థ (సీఈఏ) అంచనాల ఆధారంగా కొనుగోళ్లు చేపడుతున్నామని చెప్తున్నప్పటికీ సీఈఏ అంచనాలకు, వాస్తవ డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాసాలున్నాయని పేర్కొన్నారు. రియలిస్టిక్ డిమాండ్ గ్రోత్‌ను అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని ఈఆర్సీని అభ్యర్థించారు. సింగరేణి థర్మల్ ప్లాంట్ క్యాప్టివ్ క్యాస్ట్ భారీగా పెరుగనున్నదని, దీనిపై ఈఆర్సీ పరిశీలన చేయాలని సూచించారు.
థర్మల్ ప్లాంట్లు బ్యాక్‌డౌన్ చేస్తే యూనిట్‌కు రూ.3 ఫిక్స్డ్ కాస్ట్‌గా చెల్లించాలని, కొనుగోళ్లు చేయకుండానే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని పేర్కొంటూ.. ఫిక్స్డ్ కాస్ట్‌ను మినహాయించాలని కోరారు. మన రాష్ట్రంలో బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు తెప్పిస్తున్నారని, దీంతో వేరియబుల్ కాస్ట్ భారీగా పెరుగుతుందని తెలిపారు. ఈఆర్సీ అనుమతి ఇవ్వకముందే టెండర్లు పిలువడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కొనుగోళ్ల ప్రతిపాదనలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

