ఉలాన్బాతర్: ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు జోరు కనబరుస్తున్నారు. పురుషుల విభాగంలో ఇప్పటికే ఐదు కాంస్యాలు దక్కగా.. తాజాగా మహిళా రెజ్లర్లు పతకాల ఖాతా తెరిచారు. మంగోలియా వేదికగా గురువారం జరిగిన టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ సరితా మోర్, సుష్మ షోకిన్ కాంస్య పతకాలు చేజిక్కించుకున్నారు. 2021 ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత సరిత 59 కిలోల విభాగం తొలి రెండు రౌండ్లలో తడబడింది. రెండు ఓటముల అనంతరం పుంజుకున్న సరిత మూడో బౌట్లో విజయం సాధించింది. అనంతరం నిర్ణయాత్మక నాలుగో రౌండ్లో 5-2తో డియానా కయుమోవ (కజకిస్థాన్)ను చిత్తు చేసి కాంస్యం చేజిక్కించుకుంది. 55 కిలోల విభాగం తొలి రౌండ్లో విఫలమైన సుష్మ మూడు, నాలుగో రౌండ్లలో ఏకపక్ష విజయం సాధించింది.