న్యూఢిల్లీ: 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 25 లక్షల ఫేక్ ఓట్లతో బీజేపీ విజయం సాధించినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిని ఖండిస్తూ ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడారు. హర్యానాలో ఉన్న ఓటర్లలో ప్రతి 8 మంది ఓట్లలో ఒకరు నకిలీ ఓటరు ఉన్నట్లు ఆరోపించారు. బీజేపీ విజయం కోసం ఎన్నికల సంఘం సహకరిస్తున్నట్లు రాహుల్ గాందీ ఆరోపించారు. డూప్లికేట్, ఫేక్ ఓటర్లతో బీజేపీ విజయానికి ఈసీ సహకరిస్తున్నట్లు విమర్శించారు. ఫేక్ ఓట్లకు సంబంధించిన ఫోటోలు, రికార్డులను ఆయన మీడియాకు చూపించారు.
ఫేక్ ఓటర్ల జాబితాలో బ్రెజిల్ దేశ మోడల్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. రాయ్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఆ మోడల్ సుమారు 22 సార్లు ఓటు వేసినట్లు రాహుల్ ఆరోపించారు. ఆ మోడల్‌కు చెందిన అఫీషియల్ సోషల్ మీడియా పేజీని కూడా చూపించారు. హర్యానా ఓటర్ల జాబితాలో ఓ మహిళ పేరు 223 సార్లు ఉన్నట్లు మరో ఉదాహరణ ఇచ్చారు రాహుల్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేతలు.. హర్యానాలో ఓట్లు వేసినట్లు ఉన్న రికార్డులను కూడా కాంగ్రెస్ నేత మీడియా ముందు ప్రజెంట్ చేశారు.
ఓటర్ల జాబితా నుంచి డూప్లికేట్ ఓట్లను ఎన్నికల సంఘం ఎందుకు తొలగించడం లేదని, ఎందుకంటే అది బీజేపీ విజయానికి కారణం అవుతుందని రాహుల్ గాంధీ అన్నారు. హర్యానా ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ విజయాన్ని సూచించాయని, కానీ బీజేపీ గెలవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. హర్యానా ఎన్నికల ఓటర్ల జాబితా నుంచి 3.5 లక్షల ఓట్లను ఈసీ తొలగించిందన్నారు. దీంట్లో చాలా మంది ఓటర్లు 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసినట్లు ఆయన తెలిపారు.
హర్యానాలో ఎన్నికలు జరగలేదని, అక్కడ దోపిడీ జరిగిందన్నారు. తాను చేస్తున్న ఆరోపణలకు ఈసీ రికార్డులే సాక్ష్యాలు అని, వాటిని చెక్ చేసి, మన ఎన్నికల తీరు ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ఇలాంటి వ్యవస్థ పరిశ్రమగా మారిందని, దీన్ని ఇతర రాష్ట్రాల్లో వాడే అవకాశం ఉన్నట్లు ఆరోపించారు. బీహార్‌లోనూ ఇదే జరుగుతుందని, ఈ వ్యవస్థను మార్చలేమని, ఎందుకంటే ఓటర్ల జాబితా చివరి నిమిషంలో తయారవుతుందని, ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని చంపడమే అని ఆయన పేర్కొన్నారు.