న్యూఢిల్లీ: మహాదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) స్కామ్‌కు కారణమైన రవి ఉప్పల్ అనే వ్యక్తిని వెతికి పట్టుకోవాలని ఇవాళ ఈడీని సుప్రీంకోర్టు కోరింది. దుబాయ్‌లో ఉన్న రవి పరారీలో ఉన్నట్లు తెలిసింది. గుర్తు తెలియని ప్రదేశానికి అతను పారిపోయినట్లు భావిస్తున్నారు. కోర్టులను, దర్యాప్తు సంస్థలను ఆ నిందితుడు ఓ ఆట వస్తువుగా చూస్తున్నాడని, దీన్ని అనుమతించవద్దు అని, వైట్ కాలర్ నేరానికి పాల్పడిన అతన్ని వెతికి పట్టుకోవాలని ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను సుప్రీంకోర్టు కోరింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, సతీశ్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.
ఇది తమ అంతరాత్మను షాక్‌కు గురి చేస్తున్నదని, ఈ అంశంలో కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం చెప్పింది. భారత్‌లోని దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకున్న అతను దుబాయ్‌కి వెళ్లాడు. అక్కడ కూడా నిఘా వర్గాల నుంచి అతను మాయమైనట్లు తెలుస్తోంది. దీంతో యూఏఈ అధికారులు అతని అప్పగింత ప్రక్రియను మూసివేశారు. అలాంటి నేరగాళ్లకు కోర్టులు, దర్యాప్తు సంస్థలు ఓ ఆటవస్తువులయ్యాయని, ఈ అంశంలో ఏదో ఒకటి చేస్తామని ధర్మాసనం తెలిపింది. అతన్ని గుర్తించి, పట్టుకోవాలని ఈడీని కోరింది సుప్రీంకోర్టు. ఒక చోటు నుంచి మరో చోటుకు పారిపోవడంలో అతనికి వనరులు చాలా ఉన్నట్లు తెలుస్తోందని కోర్టు పేర్కొన్నది.
రవి ఉప్పల్ దరఖాస్తు చేసుకున్న పిటీషన్‌పై సుప్రీంకోర్టు వాదనలు విన్నది. మార్చి 22వ తేదీన చత్తీస్ఘడ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రవి కోర్టును ఆశ్రయించారు. రాయ్‌పూర్ ట్రయల్ కోర్టులో ఉన్న మనీల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని చత్తీస్ ఘడ్ హైకోర్టు ఆదేశించింది. ఈడీ తరపున అనదపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు. 2023లో దుబాయ్‌లో అతన్ని పట్టుకున్నారని, కానీ ఇప్పుడు అప్పగింత జరగడం లేదని కోర్టు తెలిపింది.
సుమారు ఆరు వేల కోట్లకు సంబంధించిన మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వాస్తవానికి డిసెంబర్ 2023లో అతన్ని దుబాయ్‌లో అరెస్టు చేశారు. భారత్‌కు అతన్ని అప్పగిస్తారని ఆశిస్తున్న సమయంలో రవి ఆచూకీ చిక్కడం లేదని తెలిసింది. ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్‌కార్నర్ నోటీసు ఆధారంగా రవి ఉప్పల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే 45 రోజుల తర్వాత అతన్ని రిలీజ్ చేశారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి గుర్తు తెలియని ప్రదేశానికి ఆ నిందితుడు పరారీ అయినట్లు పేర్కొన్నారు. సరైన సమయంలో డాక్యుమెంట్లు అందని కారణంగా రవి ఉప్పల్ అప్పగింతను తిరస్కరించినట్లు యూఏఈ అధికారులు చెప్పారు 2018లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ బయటకు వచ్చింది. రోజుకు ఆ యాప్ ద్వార సుమారు 200 కోట్లు జనరేట్ అయ్యేవి. సుమారు ఆరు వేల కోట్ల మేర బెట్టింగ్ నెట్వర్క్ ఆపరేట్ చేసినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా 3200 మంది దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. చత్తీస్‌ఘడ్‌లోని కొన్ని సిటీలతో పాటు మలేషియా, థాయిలాండ్ లో ఆపరేటింగ్ సెంటర్లు ఉన్నాయి. పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకులతో చంద్రకార్, ఉప్పల్‌కు మంచి లింకులు ఉన్నాయి. దర్యాప్తు సంస్థ నిఘాలో పడకుండా ఉండేందుకు పేమెంట్స్ అన్నీ యాప్ ద్వారా చేశారు.