గోల్నాక, జనవరి 22: ఒక్కగానొక్క కొడుకు.. కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరడంతో ఎంతో సంతోషించింది ఆ తల్లి.. కొడుకు ప్రయోజకుడయ్యాడని ఆర్నెళ్ల కిందట బంధువుల అమ్మాయితో ఘనంగా వివాహం జరిపించింది. సంతోషంగా సాగుతున్న కొడుకు జీవితాన్ని రోడ్డు ప్రమాదం జీవశ్ఛవంలా మార్చేసింది. తీవ్ర గాయాలతో నాలుగు రోజులుగా దవాఖానలో చికిత్స పొందుతూ..అతడు బ్రెయిన్ డెడ్ కావడంతో ఆ కన్న తల్లి కోడలితో కలిసి వైద్యుల సూచనల మేరకు పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం చేసి ఆదర్శంగా నిలిచారు.
అంబర్‌పేట ఎస్సై సాల్వేరు మల్లేశం, బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…గోల్నాక తులసీరాంనగర్కు చెందిన .శ్రీకాంత్ (27) పేట్ల బురుజులో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సమీప బంధువైన నళిని(25)ని పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఈ నెల 16న రాత్రి 11 గంటల సమయంలో విధులు ముగించుకొని తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా, గోల్నాక మెయిన్ రోడ్డ వద్ద ఓ బాలుడు అతివేగంతో బైక్‌పై వెళ్తూ..శ్రీకాంత్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్‌ను చికిత్స కోసం మలక్‌పేట యశోద దవాఖానకు తరలించారు. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. వారి సూచన మేరకు కుటుంబసభ్యులు జీవనదానానికి ముందుకొచ్చారు. శ్రీకాంత్ నుంచి గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం, కళ్లు వంటి అవయవాలను సేకరించి.. ఇతరులకు దానంగా ఇచ్చారు. ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదానికి కారణమైన మైనర్ బాలుడిని శనివారం పోలీసులు కోర్టులో హాజరు పర్చగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు అతడిని పోలీసులు జువైనల్ హోంకి తరలించారు.