
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మిణ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ (బెస్ట్) పథకానికి సంబంధించిన పెండింగు దరఖాస్తుల పరిశీలనను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రారంభించింది. పరిషత్ వద్ద ఇంకా 700 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిశీలించిన అనంతరం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అనంతరం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ప్రక్రియనంతా డిసెంబర్ చివరినాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం పూర్తయితే కొత్త దరఖాస్తులను ఆహ్వానించేందుకు వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బ్రాహ్మణులకు ఆర్థికంగా సహాయం అందించేందుకు ‘బెస్ట్’ స్కీమ్‌ను అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. 2017 నుంచి అమలవుతున్న ఈ పథకంలో ఈ ఏడాది జనవరి వరకు 2011మందికి రూ. 56,45,26,727 గ్రాంటుగా అందించారు.