హైదరాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ) : కేంద్రం సంస్కరణల పేరిట తీసుకొస్తున్న వీబీ-జీ రామ్ జీ చట్టంతో ఉపాధి హామీ పథకం నిర్వీర్యమయ్యే ప్రమాదమున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పేదల పనిహక్కును మోదీ ప్రభుత్వం కాలరాసేందుకు యత్నించడం దుర్మార్గమని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. 60:40 నిధుల నిబంధనతో రాష్ర్టాలపై ఆర్థిక భారం పడి పథకం అమలు ప్రమాదంలో పడే అవకాశమున్నదని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆర్థికంగా బలోపేతం లేని ఈశాన్య రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మాగాంధీని తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన ఆయన, మోదీ సర్కారు చర్య దేశానికి మంచిది కాదని ఆక్షేపించారు. ఇప్పటికైనా ఉపాధి హామీ చట్టంలోని 60:40 నిధుల నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు.