ముంబై: మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. తాజా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అధికార మహాయుతి కూటమి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ఎమ్మెల్యేలు బహిష్కరించినట్లు శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే చెప్పారు. శాసన సభ ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియోగానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈవీఎంలను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని మండిపడ్డారు. ఇది ప్రజా తీర్పు కాదని, ఎన్నికల కమిషన్, ఈవీఎంల తీర్పు అని ఆరోపించారు. తమ కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశాల తొలి రోజు ప్రమాణ స్వీకారం చేయరని వివరించారు. ఈ పరిణామాలపై మహాయుతిలోని ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్ స్పందిస్తూ, ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకించకూడదని, సభా కార్యకలాపాల్లో పాలుపంచుకోవాలంటే, ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుందన్నారు.
అజిత్‌కు ఊరట బినామీ ఆస్తుల కేసు కొట్టివేత
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు భారీ ఊరట లభించింది. 2021లో స్వాధీనం చేసుకున్న రూ. 1,000 కోట్ల విలువచేసే ఆస్తులను ఆదాయం పన్ను శాఖ శనివారం విడుదల చేసింది. అజిత్ పవార్, ఆయన కుటుంబ సభ్యులు బినామీ ఆస్తులను సంపాదించుకున్నారని వచ్చిన ఆరోపణలను ప్రివెన్షన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టి వేసింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ తీర్పు రావడం గమనార్హం. తీర్పుపై అజిత్ పవార్ స్పందిస్తూ అప్పీలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని అన్నారు. కాగా..బినామీ ఆస్తులను కలిగి ఉన్నారన్న ఆరోపణలపై 2021 అక్టోబర్ 7న అజిత్ పవార్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన అనేక ప్రదేశాలపై ఐటి శాఖ దాడి చేసింది. సతారాలో ఒక చక్కెర ఫ్యాక్టరీ, ఢిల్లీలో ఒక ఫ్లాట్, గోవాలో ఒక రిసార్టుతోసహా అనేక ఆస్తులను ఐటి శాఖ స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ఆస్తులలో ఏవీ అజిత్ పవార్ పేరిట లేవని దర్యాప్తులో వెల్లడైంది. సరైన ఆధారాలు లేవన్న కారణంతో అజిత్ పవార్పైన వచ్చిన ఆరోపణలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది.