మన్సూరాబాద్, నవంబర్ 21: అప్పటివరకు బుడిబుడి అడుగులు వేస్తూ తండ్రితో ఆడుకొన్న చిన్నారి.. తండ్రి నడుపుతున్న కారుకిందే పడి దుర్మరణం చెందాడు. ఈ విషాద ఘటన ఆదివారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన అంగిర్ల లక్ష్మణ్, రాణి దంపతులు ఎల్బీనగర్ కాస్మొపాలిటన్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వీరికి కూతురు భవానీ, ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు సాత్విక్ ఉన్నారు. లక్ష్మణ్ అప్పుడప్పుడు డ్రైవింగ్‌కు వెళ్తుంటాడు. ఆదివారం ఉదయం అపార్ట్మెంట్లో నివాసముండే వ్యక్తికి చెందిన కారును వాష్ చేశాడు. కారును లోపలికి తీసుకువస్తుండగా కూతురు రావడంతో పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత కుమారుడు కూడా వచ్చినప్పటికీ.. గమనించని లక్ష్మణ్ కారును ముందుకు తీసుకెళ్లగా టైర్‌కింద పడి సాత్విక్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కామినేని దవాఖానకు తరలించగా అప్పటికే బాలుడు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.