హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్‌సెట్ ఎంట్రెన్స్టెస్ట్కు తేదీలు సెట్ కావడంలేదు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్, జేఈఈ పరీక్షలు ఈ పరీక్ష నిర్వహణకు అడ్డంకిగా మారాయి. ఆన్లైన్ స్లాట్స్ దొరక్కపోవడంతో పరీక్షాతేదీలపై స్పష్టత కొరవడింది. మొత్తంగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ మధ్య కొన్ని తేదీలుండగా, ఈ తేదీల్లో ఎప్‌సెట్‌ను నిర్వహించాలన్న ఆలోచనలో అధికారులున్నారు. ఈ సారి ఎప్‌సెట్ పరీక్షలకు నీట్ పరీక్షలు అడ్డంకిగా మారాయి. నీట్ పరీక్షలను ఇది వరకు ఆఫ్‌లైన్‌లో నిర్వహించగా, ఈ ఏడాది నుంచి ఆన్లైన్లో నిర్వహించనున్నారు. మే 6 నుంచి ఈ పరీక్షలు జరగనున్నాయి.
ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్స్-2 పరీక్ష జరగనుంది. మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ జరగనుంది. వెంట వెంటనే పరీక్షలుండటంతో ఎప్‌సెట్‌కు ఆన్లైన్ స్లాట్లు దొరకని పరిస్థితి నెలకొన్నది. దీంతో సందిగ్ధత కొనసాగుతున్నది. ఎప్‌సెట్ సహా ఇతర పరీక్షల్లో స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటూ తేల్చలేదు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన పదేండ్ల గడువు పూర్తికావడంతో ఇప్పుడు కొత్తగా స్థానికతను నిర్ధారించాల్సి ఉంది. ఇది తేలితేనే ఎప్‌సెట్ నోటిఫికేషన్, షెడ్యూల్స్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొంత సమయం పట్టే అవకాశముంది.