వేడుక ఏదైనా వేదిక మీద కేక్ ఉండాల్సిందే. సెలెబ్రిటీలా సాధారణ ప్రజలా అన్నది అక్కడ చిన్న విషయం. అయితే వీటిలోనూ ఎవరి అభిరుచిని బట్టి వాళ్లు ఫ్లేవర్నే కాదు, కేకులు కొనే బేకరీనీ ఎంచుకుంటారు. సెలెబ్రిటీలూ అంతే. బాలీవుడ్లో పేరు మోసిన స్టార్లు, ముంబయిలో అంబానీలాంటి పారిశ్రామికవేత్తలూ తమకంటూ ప్రత్యేకంగా కొన్నిచోట్ల నుంచి మాత్రమే వాటిని తెప్పించుకుంటారు. అవి కూడా రుచికరంగానే కాదు, పోషక భరితంగానూ ఉండాలని కోరుకుంటారు. అలా వీళ్లంతా మనసుపడే ప్రత్యేకమైన బ్రాండ్ బేకరీలను స్థాపించిన వాళ్లంతా ఆడవాళ్లే అవడం విశేషం. ఇంతకీ వాళ్లు మొదలుపెట్టిన సంస్థలు, వాటి ప్రత్యేకతలు ఏంటంటే..
ఆ మధ్య అనంత్ అంబానీ వివాహం పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆ పెండ్లి కేక్ విదేశాల నుంచి తెప్పించిందయినా, ఎంగేజ్మెంట్ కేక్ మాత్రం భారత్‌లో చేయించిందే. దాదాపు వంద కిలోల బరువుండే దీన్ని తయారు చేసింది 69 ఏండ్ల బంటీ మహాజన్. దాదాపు 20 ఏండ్ల క్రితం ఆమె ‘డెలీషియా’ సంస్థను ప్రారంభించింది. ఆమెకు నగలంటే భలే ఇష్టం. నాజూగ్గా ఉండే వాటి నగిషీలను తన కేకులకు అద్దాలని ఆరాటం. ఆ కారణంగానే ఎడిబుల్ లేస్‌ను తయారుచేసి, దాన్ని కేకులకు అలంకరిస్తుంది. ఇంకేముంది, బంటీ కేక్‌లు ఎప్పుడూ షో స్టాపర్లే. ఆమె సునిశితమైన పనితీరు ఎందరో సెలెబ్రిటీలను ఆకట్టుకుంది. ఫర్హాన్ అక్తర్, మలైకా అరోరాలాంటి వాళ్లు ఆమె క్లయింట్లు. అనంత్, రాధిక జంట కోసం తొమ్మిది పెద్ద వరుసల్లో తెల్లని కేక్‌ను చేసిందామె. దాని మీద వందల సంఖ్యలో చిన్న చిన్న ఎర్ర గులాబీలను అలంకరించింది. ‘అప్పట్లో నేను తయారుచేసిన కేక్‌ను ఓ సినిమా స్టార్‌కు బహూకరించారు నా క్లయింట్. అది చాలా నచ్చడంతో ఆ యాక్టర్ మళ్లీ నా దగ్గర కేక్ చేయించుకున్నారు. అలా సెలెబ్స్‌తో నా ప్రయాణం ప్రారంభమైంది. అది అంబానీల దాకా సాగింది. అయితే నాకు సాధారణ కస్టమర్లూ చాలామంది ఉన్నారు. స్టార్లయితే ప్రత్యేకం… లేదంటే వేరు… అన్నది ఏమీ ఉండదు నాకు. ఎవరైనా సమానమే. ఎవరి కోసమైనా అంతే శ్రద్ధగా పనిచేస్తా’ అని చెబుతుంది బంటీ.
అలియా భట్, రణబీర్కపూర్ల పెండ్లికి… ఎండిన పువ్వులు, స్విస్క్రీమ్లను జోడించి టవరింగ్ కేక్‌ను తయారుచేసింది పూజా ధింగ్రా . ‘మాకరాన్ క్వీన్’గా ధింగ్రాకు పేరుంది. డిజైనర్ మసాబా గుప్తా సీమంతం కోసం ఆమె చేసిన పార్లే జి పుడ్డింగ్ ఆహూతుల్ని ఆకర్షించడమే కాదు, నెట్టింటా వైరల్ అయింది. 2010లో ఆమె ‘లె 15 పాటిస్సెరీ’ని ప్రారంభించింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆమె చేతి కేకునో, పుడ్డింగునో రుచి చూసిన నోరు వహ్వా అనకుండా ఉండలేదంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా పెండ్లికి ఆరు వరుసల్లో చేసిన కేక్ మీద, పై వరుసలో మాకరాన్గా పిలిచే ప్రత్యేకమైన బిస్కెట్లను అలంకరించి దాన్ని స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిపింది పూజ. అలా ఆర్డర్ వచ్చిన ప్రతిచోటా తన ప్రత్యేకతను చాటుకుంటూ బాలీవుడ్ నటులు, డిజైనర్ల ఫేవరెట్ బేకర్‌గా మారిందామె. నిజానికి ఆమె సాధారణ ప్రజలతోనూ అంతే సరదాగా మమేకమవుతుంది. ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్ట్‌లు పెడుతూ, బేకరీ ఐటెమ్స్ చేసే విషయంలో రకరకాల ప్రయోగాలు చేస్తుంటుంది. ఇటీవలే, తన ఫాలోవర్లను ఉద్దేశిస్తూ ‘ఏవైనా ఓ మూడు పదార్థాలు చెప్పండి… వాటితో నేను అద్భుతమైన డిజర్ట్ తయారుచేస్తాను’ అంటూ సవాలు విసిరింది. ‘ఒకరు కాకరకాయ, క్రీమ్ చీజ్, పుల్లటి చెర్రీలు…’ అని చెప్పారు. ‘ఇలా అడిగినప్పుడు జనాలు చెప్పే కాంబినేషన్లు చూస్తుంటే భలే సరదాగా అనిపిస్తుంది. కానీ నేను వాళ్లు చెప్పిన చిత్రమైన పదార్థాలతోనే వావ్ అనిపించే డిజర్ట్ చేసి చూపించాను. నాకు జోష్ ఇచ్చే అంశం అచ్చంగా ఈ కొత్త ప్రయోగాలే’ అని చెబుతుంది 38 ఏండ్ల ధింగ్రా. ఈ మధ్య తన బ్రాండ్‌తో కుకీలనూ అమ్ముతున్నది.
బేకర్ జూహీ పహ్వా జొన్నలతో చేసే డార్క్ చాక్లెట్ కేక్ అంటే కత్రినా కైఫ్‌కు ఎంతో ఇష్టమట. అంతేకాదు, ఆమె చేతి పాన్కేక్లనూ ప్రేమగా లాగిస్తుందట. అచ్చంగా తమలాగే ఫిట్‌గా కనిపించే ఈమె చేతి రుచులంటే కత్రినానే కాదు, చాలామంది సెలెబ్రిటీలూ ప్రాణం పెడతారు. తన వంటల్లో బాదం పొడి, తాటి బెల్లం, కొబ్బరి చక్కెర, గింజల నుంచి తీసిన పాలు, ఆర్గానిక్ తేనె మొదలైనవి వాడుతుందామె. సాధారణంగా కేకుల్ని మైదా, పాలు, రిఫైన్డ్ షుగర్, గుడ్లతో చేస్తారు. ఇవన్నీ ఆమెకు బహుదూరం. జూహీ చేసే కన్ఫెక్షనరీల్లో జొన్నపిండితోచేసే డార్క్ చాక్లెట్ కేక్ చాలా ఫేమస్. పాన్కేక్, పుడ్డింగ్, కుకీ… ఇలా ఏం చేసినా అందులో ఏం వాడుతున్నాం, ఎన్ని క్యాలరీలున్నాయి అన్నది తప్పక చూసుకుంటుంది జూహీ. అందుకే అనన్య పాండే, దీపికా పదుకొణె, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , అలియా భట్‌లాంటి నటీమణులతోపాటు మనీశ్ మల్హోత్ర లాంటి సెలెబ్ డిజైనర్ కూడా ఆమె క్లయింట్ లిస్టులో ఉన్నారు. ‘ఆరోగ్యకరమైన కేకులంటే చాలా బోరింగ్‌గా రుచి లేకుండా ఉంటాయని అనుకునేదాన్ని. వాటిని వావ్ అనిపించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నా’ అని చెబుతుంది 34 ఏండ్ల జూహీ.
కేక్, పుడ్డింగ్, కుకీ, పేస్ట్రీ… ఇలా ఏదైనా సరే ఆరోగ్యకరంగా తయారు చేయడం అలవాటు 54 ఏండ్ల దివ్య రంగ్లానీకి. అదే ఆమె ప్రత్యేకత కూడా. అందుకే తన సంస్థకు ‘హెల్దీ ట్రీట్స్’ అని పేరు పెట్టుకుంది. ఇటీవల హీరో అర్జున్ కపూర్, ఆయన చెల్లెలు అన్శు కోసం తయారుచేసిన క్వినోవా కేక్ తెగ ఫేమస్ అయింది. జుచ్చిని, వేయించిన బాదంపప్పులను జోడించి ఒక ప్రత్యేకమైన ఈవెంట్ కోసం దీన్ని తయారుచేసింది. నిమిషాల్లో అది ఖాళీ అయిపోయిందని మురిసిపోతూ చెబుతుంది రంగ్లానీ. యోగర్ట్, క్రాన్బెర్రీ, నట్స్ కలబోతగా ఆమె ఇటీవల చేసిన గ్రానోలా కేక్ (ఓట్స్ మిక్స్)కు తెగ ఆర్డర్లు వస్తున్నాయట. మొన్నటి అలియా భట్ పుట్టిన రోజుకు వాళ్ల అమ్మ సోనీ రజ్దాన్ దీన్ని ప్రత్యేకంగా తెప్పించడంతో ఇది బాగా ఫేమస్ అయింది. ఇవేకాదు, ఆమె చేసిన గ్లూటెన్ ఫ్రీ కుకీలు, ఆల్మండ్ బిస్కెట్లు, బనానా బ్రెడ్లాంటివి నటి కృతిసనన్ ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. ముడి గోధుమపిండి, నేచురల్ స్వీట్నర్లు, ఆరోగ్యకర పదార్థాలనే తన రుచుల్లో వాడతారామె. హీరోయిన్లు మలైకా అరోరా తన క్రిస్మస్ రుచులన్నీ ఈమెతోనే చేయించుకుంటే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి దివ్య బ్రౌనీలంటే ప్రాణమట. ‘నాకు తెలిసిన ఓ యాక్టర్‌కి ఖర్జూరాలు, క్యారట్లతో కేక్ చేసిచ్చాను. అది బాగా నచ్చడంతో మరొకరికి రికమెండ్ చేశారు. సోనమ్ కపూర్, లారా దత్తా లాంటివాళ్లకు తీపి తినాలనిపించినప్పుడు ఇవి అందించే వారు ఆమె. అలా సెలెబ్రిటీలు ఒక్కొక్కరూ నా క్లయింట్లు అయిపోయారు. స్టార్లయినా సాధారణ ప్రజలైనా ప్రతి ఒక్కరి కోసమూ వాళ్లు కోరినట్టు రుచిగా, జాగ్రత్తగా పదార్థాన్ని తయారు చేసివ్వాలి. లేకపోతే మరో ఆర్డర్ పొందడం కష్టం’ అని చెబుతూ వృత్తిలో తన నిబద్ధతను చాటుకుంటుంది దివ్య.