
హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): దశాబ్దాల తరబడి ఎన్నో కష్ట, నష్టాలకు ఓర్చుకొన్న తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ధైర్యాన్ని కూడదీసుకొంటున్నారు. గతకాలపు అప్పులు తీర్చుకొంటూ, రెండేండ్లుగా కుదుటపడుతున్నారు. కానీ, బాగుపడే దశలో రైతుల బొండిగ పిసికేంత పనిచేస్తున్నది కేంద్రంలోని బీజేపీ సర్కార్. యాసంగి ధాన్యం కొనబోమంటూ కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ రైతుల నెత్తిన పిడుగులేశాయి. బీజేపీ రైతు వ్యతిరేక వైఖరితో తెలంగాణ రైతుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం కనిపిస్తున్నది.
రెండేండ్లుగా వరి సాగుతో ఆర్థికంగా భరోసా కలిగిందని, ఇలాగే మరో రెండు, మూడు పంటలు చేతికొస్తే ఆర్థిక కష్టాల నుంచి పూర్తిగా కోలుకునేవాళ్లమని రైతులు అభిప్రాయపడుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోకుండా, ప్రైవేటు వ్యాపారి మాదిరిగా నిర్ణయాలు తీసుకొంటున్నది. రైతులను నట్టేట ముంచేలా వ్యవహరిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, రైతుల సాగునీటి కష్టాలు తీర్చారు. దీంతో రెండేండ్లుగా వరి సాగు విస్తీర్ణం పెరిగింది. 2018-19కి ముందు యాసంగిలో 20 లక్షల ఎకరాల్లోపే వరి సాగయ్యేది.
ఇందులో పంట చివరి వరకు నీళ్లు పారక సగం ఎండిపోయేది. సాగునీరు అందుబాటులోకి రావడంతో రెండేండ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. 2019-20 యాసంగిలో 38 లక్షల ఎకరాల్లో సాగు కాగా 2020-21లో 52 లక్షల ఎకరాలకు ఎగబాకింది. వరి సాగు లాభసాటిగా మారడంతో తెలంగాణ అన్నదాతలు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకొంటున్నారు. మరో రెండు మూడు పంటలు ఇదే తీరున సాగైతే ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతామన్న నమ్మకం రైతుల్లో వ్యక్తమవుతున్నది. కానీ బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయం వారిని దిక్కుతోచని స్థితిలోకి నెడుతున్నది.
2022 సంవత్సరం నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధ ఫలితాలిచ్చే నిర్ణయాలు తీసుకొంటున్నది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయకపోగా ఇప్పుడున్న ఆదాయాన్ని కూడా తగ్గిస్తున్నదని రైతులు, వ్యవసాయరంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సర్కారుకు రైతుల సంక్షేమం కన్నా కార్పొరేట్ శక్తుల, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని పలువురు వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని హితవు చెప్తున్నారు.