లక్నో, జనవరి 20: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం కోసం ఓ గ్రామానికి వెళ్లిన అధికార బీజేపీ ఎమ్మెల్యేకు ఘోర పరాభవం ఎదురైంది. ఎమ్మెల్యేను ఆ గ్రామ ప్రజలు తరిమి తరిమి కొట్టారు. కారు ఎక్కేంతవరకూ వెంబడించారు. గ్రామస్థుల ఆగ్రహావేశాలకు భయపడిపోయిన ఆ నాయకుడు.. బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలీలో చోటుచేసుకొన్నది. ఖతౌలీ ఎమ్మెల్యే విక్రమ్‌సింగ్ సైనీ ఓ మీటింగ్‌కు హాజరుకావడానికి బుధవారం నియోజకవర్గంలోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడికి వెళ్లగానే ఆయన కారును చుట్టుముట్టిన ప్రజలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘మీటింగ్ లేదు.. ఏం లేదు.. ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక వెంటనే కారెక్కిన సైనీ.. గ్రామస్థులకు దండం పెడుతూ మెల్లగా అక్కడినుంచి జారుకున్నారు.
నిరసనలు ఎందుకంటే?
వివాదాస్పద సాగు చట్టాలను తీసుకురావడం, ఏడాదికి పైగా రైతులు చేపట్టిన నిరసనోద్యమాన్ని లెక్కచేయకపోవడం,700 మందికి పైగా అన్నదాతలు మరణించినా పట్టించుకోకపోవడం తదితర కారణాలు యూపీలోని పలు గ్రామాల్లో అధికార బీజేపీపై ఆగ్రహాన్ని తీసుకొచ్చాయి. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉన్నపళంగా వెనక్కి తీసుకున్నదని అందరికీ అర్థమయ్యింది. ఈ పరిణామాలను గమనించిన సదరు గ్రామస్థులు బీజేపీ ఎమ్మెల్యే సైనీ గ్రామంలోకి రాగానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు స్థానిక వర్గాలు తెలిపాయి. సాగుచట్టాలు, రైతు మరణాలపై మోదీ సర్కారు ప్రవర్తించిన తీరు రానున్న ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, తాజా ఘటన అధికార బీజేపీలో గుబులు రేపుతున్నది.
గ్రామస్థుల నిరసనలపై ఎమ్మెల్యే ఏమన్నారంటే..
స్థానికులు అడ్డుకోవడానికి గల కారణమేంటని విక్రమ్‌సింగ్ సైనీని మీడియా ప్రశ్నించింది. ‘వాళ్లు మద్యం మత్తులో ఉన్నారు. అందుకే ఏదేదో మాట్లాడారు. అంతే తప్ప ఇంకేం లేదు’ అంటూ సైనీ చెప్పుకొచ్చారు.
వివాదాలకు కేరాఫ్
ఎమ్మెల్యే విక్రమ్‌సింగ్ సైనీ గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 2018లో ‘నా దేశం హిందుస్థాన్. అంటే ఈ దేశం హిందువులదే. ఆవులను చంపేవాళ్ల బొక్కలు విరిచేస్తా’ అని కామెంట్ చేశారు. ఆ తర్వాత 2019లో భారత్‌లో రక్షణ లేదని చెప్పేవారిని బాంబ్ పెట్టి పేల్చేస్తానని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇకపై తెల్లగా ఉండే కశ్మీరీ అమ్మాయిలను ఎవరైనా పెండ్లి చేసుకోవచ్చు. దీని కోసం బీజేపీ కార్యకర్తలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.