హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడంపై ఆ పార్టీలో కలకలం రేపింది. కుమ్రంభీం-ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే అయిన హరీశ్‌బాబు బుధవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ వార్త రాజకీయ వర్గాల్లో రోజంతా చర్చనీయాంశంగా మారింది. తమ ఎమ్మెల్యే సీఎంను కలవడంపై తమకు ముందస్తు సమాచారం లేదని బీజేపీ రాష్ట్ర నాయకుడొకరు వ్యాఖ్యానించారు. పూర్వాశ్రమంలో హరీశ్‌బాబు కాంగ్రెస్ నాయకుడే కావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆందోళన చెందుతున్నది. అయితే నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే ఆయన సీఎంను కలిసి ఉంటారని హరీశ్‌బాబు సన్నిహితులు చెప్తున్నారు.