(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : అమృతం సేవించాకే దేవతలకు అమరత్వం సిద్ధించిందన్నది పురాణ వచనం. ఒక దశకు చేరుకొన్నాక వయసు వృద్ధిరేటును నిలిపేయడం, కోల్పోయిన అవయవాలను తిరిగి పొందడం, శరీరం తానంతట తానే రిపేర్ కావడం అమరత్వంలోని మూలార్థం. వైద్యశాస్త్రంలో చోటుచేసుకొన్న గణనీయమైన అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు మనుషులకు మరో జీవితాన్ని ఇచ్చే దిశగా ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన బిలియనీర్ బ్రయాన్ జాన్సన్(48) క్లోనింగ్ ద్వారా ‘బేబీ బ్రయాన్’ పేరిట తనకు తాను పునఃసృష్టి చేసుకొంటున్నానని ‘ఎక్స్’లో ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ ‘బేబీ బ్రయాన్’ ప్రస్తుతం ఒక పెట్రీ డిష్‌లో (ల్యాబ్‌లలో వాడే చిన్న గిన్నె) పెరుగుతున్నట్టు ఆయన ప్రకటించారు.
బ్రయాన్ వివరాల ప్రకారం.. ముందుగా తన శరీరంలోని రక్తాన్ని సేకరించి అందులోని కణాలను వేరు చేశారు. ఆ తర్వాత ‘యమనాకా ఫ్యాక్టర్స్’ అనే ప్రత్యేక విధానం ద్వారా ఆ కణాల వయసును తగ్గించి వాటిని పిండదశ (ఎంబ్రియో) కణాల మాదిరిగా మార్చారు. చివరకు వాటిని మూలకణాలుగా తయారు చేశారు. దీన్నే ‘బేబీ బ్రయాన్’గా చెప్తున్నారు.
బ్రయాన్ సిద్ధం చేసిన ఈ మూల కణాలతో ఏం చేయవచ్చునో తెలుసుకొనే ముందు, అసలు మూల కణాలంటే ఏమిటీ? వాటి వల్ల ఏం చేయవచ్చో అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు.. ఓ వ్యక్తి దగ్గర నెయ్యి ఉంది. కానీ, అతనికి వెన్న కావాలి. ఇక, రెండో వ్యక్తి దగ్గర పెరుగు ఉంది. కానీ, అతనికి మీగడ కావాలి. మూడో వ్యక్తి దగ్గర పాలు మాత్రమే ఉన్నాయి. కానీ, అతనికి జున్ను కావాలి. ఈ ముగ్గురు వ్యక్తుల్లో కేవలం మూడో వ్యక్తి మాత్రమే తనకు కావాలసిన జున్నును తయారు చేసుకోగలడు. అంతేకాదు, మొదటి వ్యక్తికి కావాల్సిన వెన్నను, రెండో వ్యక్తికి కావాల్సిన మీగడను కూడా ఇవ్వగలడు. అంటే, నెయ్యి, వెన్న, పెరుగు, జున్ను, మీగడ కావాలంటే ముందు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో అది (పాలు) ఉండాలి. అలాగే, శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలక అవయవాల తయారీకి వేర్వేరు కణాలు ఉన్నప్పటికీ, అవన్నీ మూల కణాల నుంచే వస్తాయి. మూల కణాలను సృష్టిస్తే, ఒకరకంగా ఈ అవయవాలను మళ్లీ తయారు చేసినట్టే. అందుకే బ్రయాన్ మూల కణాలను సృష్టించాడు. వీటి సాయంతో రక్తం, చర్మం, గుండె, ఊపిరితిత్తులు, మెదడును పునఃసృష్టిస్తానని చెప్తున్నాడు. అంతేకాదు, అవయవ మార్పిడి, జబ్బు చేసినప్పుడు బాడీ రిపేరింగ్‌తో పాటు ఏజ్ రివర్సింగ్ (వయసును తగ్గించడం) వంటివి కూడా చేస్తానంటున్నాడు. మొత్తంగా తన ఆయువును పెంచుకొని, మరో కొత్త జన్మను ఎత్తుతానని ధృడంగా పేర్కొంటున్నాడు.
తాను ఆటోఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ వ్యాధి బారిన పడ్డట్టు బ్రయాన్ ఇటీవల ప్రకటించాడు. ఇదో దీర్ఘకాలిక వ్యాధి. కడుపులోని ఆమ్లాలను ఉత్పత్తి చేసే మంచి కణాలపై మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున దాడి చేయడమే ఈ వ్యాధి లక్షణం. ఈ వ్యాధికి ప్రస్తుతానికైతే శాశ్వత చికిత్స లేదు. వ్యాధి ఇలాగే కొనసాగితే దీర్ఘకాలంలో ఉదర క్యాన్సర్‌కు దారితీయొచ్చు. ఆటోఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ వ్యాధిబారిన పడటంవల్లే బ్రయాన్.. ఈ క్లోనింగ్ ప్రక్రియను మొదలుపెట్టినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, తన వయసును తగ్గించుకోవడానికి, మరణం లేకుండా ఉండేందుకు బ్రయాన్ ఇప్పటికే వందలాది కోట్లు ఖర్చుచేయడం తెలిసిందే.