Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్లో 96వ రోజు ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. షో ప్రారంభంలోనే భావోద్వేగ క్షణాలు చోటు చేసుకున్నాయి. ఇమ్మాన్యుయేల్ తనను దూరం పెడుతున్నాడని సంజన బాధపడగా, తనూజ మునుపటిలా తనతో ఉండడం లేదంటూ భరణి ఎమోషనల్ అయ్యాడు. లీడర్ బోర్డులో అతి తక్కువ పాయింట్స్‌తో బాటమ్‌లో ఉన్న భరణికి నెక్స్ట్ యుద్ధంలో పాల్గొనే అవకాశం లేదని బిగ్ బాస్ ప్రకటించారు. దీంతో తన వద్ద ఉన్న పాయింట్స్‌లో సగం వేరొకరికి ఇవ్వాల్సి రావడంతో, భరణి తన పాయింట్స్‌ను తనూజకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని బిగ్ బాస్‌కు చెబుతూ భరణి కన్నీళ్లపర్యంతమయ్యాడు. తనూజ తనకు దూరమవుతున్నప్పటికీ కనీసం తాను ఆమెకు సపోర్ట్‌గా ఉండాలని భావిస్తున్నట్లు భరణి చెప్పాడు.
ఆ తర్వాత సంజన, ఇమ్మాన్యుయేల్, తనూజల మధ్య ‘కీ టు సక్సెస్’ టాస్క్ నిర్వహించారు. స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న వస్తువులను కీతో ఓపెన్ చేసి తమ తమ రంగుల వస్తువులను తీసుకొచ్చి బోర్డులో అమర్చాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ముగ్గురూ పోటీ పడ్డారు. ఒకరినొకరు లాక్కోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. బజర్ మోగే సమయానికి ఇమ్మాన్యుయేల్ తన వస్తువులను కాపాడుకోగా, భరణి అతడినే విజేతగా ప్రకటించాడు. దీనితో సంజన తీవ్ర అసహనానికి గురై బాటిల్‌ను కింద పడేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్మాన్యుయేల్ తనను టార్గెట్ చేస్తున్నారని సంజన ఆరోపించగా, ఇమ్మాన్యుయేల్ తిరిగి వాగ్వాదానికి దిగాడు. తనను ప్రేక్షకులకు ఏ విధంగా చూపించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని, తాను కూడా మనిషినేనని, ఇలాంటి పరిస్థితులు భరించలేనని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు.
తర్వాత ఇమ్మాన్యుయేల్, సంజన మధ్య బెలూన్స్ టాస్క్ జరగగా, ఇందులో ఇమ్మాన్యుయేల్ విజయం సాధించాడు. అనంతరం ఇమ్మాన్యుయేల్, సంజన, తనూజ మధ్య సాండ్ టాస్క్ నిర్వహించారు. బిగ్ బాస్ చెప్పిన నిబంధనల ప్రకారం ఇసుక బస్తాలను త్రాసులో వేసి, ఫ్లాగ్‌ను ముందుగా అందుకున్నవారే విజేతలు. ఈ టాస్క్‌లో తనూజ విజయం సాధించి లీడర్ బోర్డులో టాప్ పొజిషన్‌కు చేరుకుంది. అయితే చివర్లో బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. టాప్ పాయింట్స్‌లో ఉన్న తనూజకు ఫైనలిస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ ఆ అవకాశం పొందాలంటే తన వద్ద ఉన్న పాయింట్స్‌ను ప్రైజ్ మనీ నుంచి తగ్గించాల్సి ఉంటుందని చెప్పారు. లేకపోతే నామినేషన్స్‌లో ఉండి ఆడియన్స్ నిర్ణయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఆప్షన్‌ను ఆలోచించిన తనూజ, పాయింట్స్ ఉపయోగించి ఫైనలిస్ట్ అవ్వకుండా, నామినేషన్స్‌లోనే ఉండి ప్రేక్షకుల తీర్పును ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. దీంతో 96వ రోజు ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగిసింది.