న్యూఢిల్లీ: స్పేస్ టూరిజం ఇప్పడిప్పుడే ఊపందుకుంటున్నది. దీనికి మరింత ఊపు తెచ్చేందుకు కాలిఫోర్నియా లోని స్పేస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అద్భుత ప్రణాళిక రచించింది. ప్రపంచంలోనే మొదటిసారిగా అంతరిక్షంలో కమర్షియల్ హోటల్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది. రెస్టారెంట్లు, జిమ్‌లు, సినిమా హాళ్లు వంటి విలాస వసతులు ఉండే ఈ హోటల్ నిర్మాణాన్ని వచ్చే ఏడాదే ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. 2027కల్లా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ హోటల్‌ను వాయేజర్ స్టేషన్‌గా పిలుస్తున్నారు. ఇది రింగ్ డిజైన్‌లో ఉంటుంది. సుమారు 1,25,000 చదరపు అడుగుల్లో ఒకదానికొకటి కలుపుతూ 24 మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులో 280 మంది అతిథులు, 112 మంది సిబ్బంది ఉండొచ్చు. హైఎండ్ రిసార్ట్ తరహాలో ఇందులో వసతులు కల్పిస్తున్నారు.
ఏమేం ఉంటాయ్?
రెస్టారెంట్లు, బార్లు
సినిమా, కాన్సర్ట్ హాళ్లు
జిమ్,రిక్రియేషన్ సెంటర్
ప్రైవేట్ సూట్స్, రెసిడెన్షియల్ విల్లాలు
భూమిని వీక్షించేలా లాంజ్‌లు స్పేస్ ట్రిప్‌కి ఎంత ఖర్చవుతుంది?
కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఇక్కడికి పర్యాటకులను పంపవచ్చు. అయితే ఈ హోటల్ ట్రిప్‌కు ఎంత ఖర్చవుతుందన్నది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. స్పేస్ టూరిజం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. రోదసిలోకి పర్యాటకులను తీసుకెళ్లేందుకు బ్లూ ఆరిజిన్ సంస్థ ఒక్కో పర్యాటకుడి నుంచి 2,00,000-4,50,000 డాలర్లు వసూలు చేస్తున్నది. అంతా సవ్యంగా సాగితే అంతరిక్ష పర్యాటకంలో వాయేజర్ స్టేషన్ ఓ కీలక మైలురాయిగా నిలవనున్నది. ఆస్ట్రోనాట్స్‌కు మాత్రమే కాకుండా సాధారణ పౌరులకు కూడా అంతరిక్షాన్ని ఓ పర్యాటక గమ్యస్థానంగా మార్చే అవకాశం ఉన్నది.