Bigg Boss 9 | బిగ్ బాస్ రియాల్టీ షోకు అన్ని భాషలలోనూ విపరీతమైన ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కూడా విజయవంతంగా ముగియగా, చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ షోలో కామనర్ కళ్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. అయితే ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ మెయిన్ షోలో లేడీ విన్నర్ లేకపోవడం గమనార్హం. కేవలం బిగ్ బాస్ ఓటీటీ వర్షన్లో మాత్రమే హీరోయిన్ బింధు మాధవి టైటిల్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9లో లేడీ కంటెస్టెంట్ విజేతగా నిలవడం ప్రత్యేక చర్చకు దారి తీసింది. హీరో విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించిన తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 అక్టోబర్ 5, 2025న ప్రారంభమై, జనవరి 18, 2026న గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్ మొత్తం 20 మంది పోటీదారులతో ప్రారంభమైంది. మూడో వారం నాటికి దివ్య గణేష్, అమీత్, సాండ్రా, ఆమె భర్త ప్రజిన్లతో కలిసి నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్‌లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆట మరింత ఆసక్తికరంగా మారింది.
జనవరి 18, 2026న ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఫినాలే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఫైనల్ స్టేజ్‌పై హోస్ట్ విజయ్ సేతుపతితో పాటు టాప్ ఫైనలిస్టులు శబరి, దివ్య గణేష్ హాజరయ్యారు. చివరగా విజేతను ప్రకటించే సమయంలో విజయ్ సేతుపతి దివ్య గణేష్ చేయి పైకెత్తి ఆమెను బిగ్ బాస్ తమిళ సీజన్ 9 టైటిల్ విన్నర్‌గా ప్రకటించారు. ఈ సీజన్లో శబరి మొదటి రన్నరప్‌గా, వికెల్స్ విక్రమ్ రెండో రన్నరప్‌గా నిలిచారు.వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చి టైటిల్ వరకూ ప్రయాణం చేయడం దివ్య గణేష్‌కు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. టెలివిజన్ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన దివ్య, ముఖ్యంగా ‘భాగ్యలక్ష్మి’ సీరియల్లో జెన్నీ పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో ఆమె ఆట తీరు, స్పష్టమైన మాటలు, ఆత్మవిశ్వాసంతో కూడిన నిర్ణయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. క్రమంగా బలమైన కంటెస్టెంట్‌గా ఎదిగి, ఫైనల్లోనూ తన సత్తా చాటింది.
విజేతగా నిలిచిన దివ్య గణేష్‌కు బిగ్ బాస్ తమిళ సీజన్ 9 టైటిల్‌తో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి అందజేశారు. వైల్డ్ కార్డ్‌గా వచ్చి లేడీ విన్నర్‌గా నిలిచిన ఆమె ప్రయాణం ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఈ విజయం దివ్య కెరీర్‌కు కొత్త ఊపునిస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.