Hemant Soren : జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జేపీఎస్సీ పరీక్షల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించింది. సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ దీపక్ రోషన్ గురువారం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జేపీఎస్సీ పరీక్షల ద్వారా ఇటీవల నియామకమైన ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట లభించింది.
జేపీఎస్సీ (జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)తోపాటు జేఎస్ఎస్సీ (జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్) చేపట్టిన పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ అక్కడి విద్యార్థి సంఘాలు, యువత గత నెల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. కొందరు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలకు దిగారు. విద్యార్థి సంఘాలతోపాటు ప్రతిపక్షాలు కూడా విద్యార్థులకు మద్దతుగా నిలిచాయి. రెండేళ్లుగా ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. చివరకు వారి డిమాండ్లకు తలొగ్గిన సీఎం హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని సర్కార్ పరీక్షల్ని రద్దు చేసింది.
2024 నుంచి జేపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలు, నియామకాల్ని రద్దు చేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నిర్ణయాన్ని తాజాగా ఎంపికైన ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. జేపీఎస్సీ ద్వారా రెండేళ్లుగా దాదాపు 39 ఉద్యోగ నియామక పరీక్షలు జరిగాయి. వాటిలో కొన్ని ఫలితాలు వెలువడి నియామకాలు కూడా పూర్తయ్యాయి. వేలాది మంది ఉద్యోగాల్లో చేరిపోయారు. జేపీఎస్సీ ప్రక్రియ ద్వారా ఎన్నికై.. ఏడాది, రెండేళ్ల నుంచి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఈ పరీక్షల్ని, నియామకాల్ని రద్దు చేయడంతో వారి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది.
దీంతో వారు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఎంపికైన ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన కోర్టు.. పరీక్షల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.