ముంబై: గృహహింసపై కోడలు ఫిర్యాదు చేయడంపై అత్త పగ పెంచుకున్నది. పనిమనిషికి డబ్బులు ఇచ్చి కోడలను హత్య చేయించింది. ప్రమాదవశాత్తు బాత్రూమ్లో జారిపడి మరణించినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కోడలి తండ్రి ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. (Woman Kills Daughter-In-Law) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 2013 మేలో ప్రమోద్‌తో 35 ఏళ్ల స్వప్నకు వివాహమైంది. రెండేళ్ల తర్వాత భర్త, అతడి కుటుంబ సభ్యులు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. ఈ నేపథ్యంలో అత్తింటి వారిపై గృహహింస, దాడి, ప్రాణహాని వంటి ఆరోపణలపై పోలీసులకు స్వప్న ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ కోర్టులో పెండింగ్‌లో ఉన్నది.
కాగా, 2024 ఆగస్ట్‌లో భర్త ప్రమోద్, అతడి కుటుంబ సభ్యులు తమ తప్పులపై సప్నను క్షమాపణ కోరారు. భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని హామీ ఇచ్చారు. ఈ ఒప్పందం తర్వాత సప్న తన భర్తతో కలిసి ముంబైలోని విఖ్రోలి ప్రాంతంలో ఉన్న ఇంటికి మారింది. కొంతకాలం తర్వాత ఘాట్కోపర్లోని అత్తవారింటికి వారు తిరిగి వచ్చి అక్కడ నివసిస్తున్నారు.
మరోవైపు కోడలు స్వప్న తమ కుటుంబంపై గృహహింస కేసు నమోదు చేయడంపై అత్త అయిన 65 ఏళ్ల ధనలక్ష్మి కోపం, పగ పెంచుకున్నది. ఈ నేపథ్యంలో ఇంటి పనిమనిషి, ఆమె కుటుంబానికి రూ.3 లక్షలు ఇచ్చి కోడలిని హత్య చేయించింది. ప్రమాదవశాత్తు ఆమె మరణించినట్లుగా చిత్రీకరించడానికి అత్తింటి వారు ప్రయత్నించారు. ఆగస్ట్ 17న తెల్లవారుజామున 12.37 గంటల సమయంలో స్వప్న మామ, ఆమె తండ్రికి ఫోన్ చేశాడు. స్వప్న బాత్రూమ్లో జారిపడిందని, తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం ఇచ్చాడు.
కాగా, స్వప్న తండ్రి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకోగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. స్వప్న తలపై లోతైన గాయంతోపాటు, ముఖం, మెడ, భుజాలపై కూడా తీవ్రమైన దాడికి సంబంధించిన గుర్తులు కనిపించాయి. దీంతో తన కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేసిన ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అత్తింటి వారిని పోలీసులు విచారించారు. అత్త ధనలక్ష్మి కట్టుకథ చెప్పేందుకు ప్రయత్నించింది. మద్యం మత్తులో ఉన్న కోడలు స్వప్న ప్రమాదవశాత్తు బాత్రూమ్లో జారిపడి మరణించినట్లు పోలీసులకు చెప్పింది.
అయితే తమ కుటుంబంపై గృహహింస కేసు పెట్టినందుకు కోపం, పగ పెంచుకున్న అత్త, కోడలిని హత్య చేయించడానికి ఇంటి పనిమనిషితో సహా నలుగురికి రూ.3 లక్షలు చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో నిందితులైన అత్త ధనలక్ష్మి, పనిమనిషి మంగళబాయి, పనిమనిషి భర్త సురేష్ గణపత్ జాదవ్, వారి కుమార్తె శివానీ, కొడుకు సాజన్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. స్వప్న భర్త, ఇతర కుటుంబ సభ్యుల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.