భూపాలపల్లి రూరల్, నవంబర్3: ఫైళ్ల నిర్వహణ వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించి పెండింగ్‌లో లేకుండా చూడాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టర్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వివిధ సెక్షన్లు, ఇతర శాఖల అధికారుల ఛాంబర్లను తనిఖీ చేసి ఫైళ్లను పరిశీలించారు. ముందుగా కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్లను పరిశీలించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఫైళ్లు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అన్నారు. సింగరేణి, జెన్కో, ఇరిగేషన్, నేషనల్ హైవే తదితర ల్యాండ్ అక్విజిషన్ వివరాల ఫైళ్లను ప్రత్యేకంగా పొందుపరచాలని అన్నారు. ఫైల్స్ ఈ-ఆఫీస్‌లో డిజిటల్ సంతకంతో పంపించాలని అన్నారు. అనంతరం ల్యాండ్ సర్వే, ప్రణాళిక, సమాచార పౌరసంబంధాలు, బీసీ అభివృద్ధి, ఎస్సీ అభివృద్ధి, గ్రౌండ్ వాటర్, పంచాయతీ, పౌరసరఫరాలు, మహిళా శక్తి కేంద్రం, తదితర శాఖల కార్యాలయాలను సందర్శించి ఫైళ్లను తనిఖీ చేశారు. కలెక్టరేట్ ఏవో మహేశ్‌బాబు, ఏడీ సర్వేల్యాండ్ సుదర్శన్, సీపీవో సామ్యూల్, డీపీఆర్వో రవికుమార్ పాల్గొన్నారు.
జెన్కో భూ సేకరణ వేగవంతం చేయండి
జెన్కో భూ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జెన్కో గెస్ట్ హౌస్‌లో జెన్కో భూ సేకరణపై రెవెన్యూ, జెన్కో అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాస్ జెన్కో సంస్థకు అవసరమైన భూమి, ఇప్పటి వరకు వరకు సేకరించిన భూమి వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, జెన్కో అధికారులు సమన్వయంతో జెన్కోకు అవసరమైన భూ సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసి భూ సేకరణ పూర్తి చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న దుబ్బపల్లి యాష్ డంపింగ్ స్థలం, కేటికే నుంచి చెల్పూర్ మీదుగా జెన్కో వరకు కన్వేయర్ బెల్ట్, తాడిచర్ల నుంచి జంగేడు మీదుగా జెన్కో వరకు కన్వేయర్ బెల్ట్, కొంపెల్లి, గుడాడ్‌పల్లిలో నూతనంగా భూ సేకరణ, కాపురం గ్రామస్తులకు పునరావాసం తదితర పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. బాధితులకు పరిహారం, నిర్వాసితులకు త్వరగా పునరావాసం కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, జెన్కో సీఈ సిద్దయ్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రవికుమార్, భూపాలపల్లి, గణపురం, మల్హర్రావు మండలాల తహసీల్దార్లు ఇక్బాల్, సతీశ్‌కుమార్, శ్రీనివాస్, జెన్కో అధికారులు పాల్గొన్నారు.