అగ్ర కథానాయకుడు రవితేజ ప్రధాన పాత్ర పోషిస్తున్న వినోదాత్మక కుటుంబకథాచిత్రం ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’. అషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలు. కిశోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల కానున్నది. ఈ సందర్భంగా ప్రచారం వేగవంతం చేశారు. ఇప్పటికే తొలి పాట ‘బెల్లా బెల్లా..’ ప్రేక్షకులను ఆకట్టుకున్నదని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తున్నది. ఈ క్రమంలో బుధవారం రెండో పాటను విడుదల చేశారు.
‘చల్లగాలి కావాలంటే చందమామను తీసుకొస్తాడే.. సన్నజాజీ కావాలంటే సంత మొత్తం మోసుకొస్తాడే.. అడిగింది అందిస్తాడే.. అంతకు మించింది తెచ్చిస్తాడే.. కోరింది తీరుస్తాడే.. వేరే కోరిక నాకింక లేకుండా చేస్తాడే.. అద్దం ముందు నిలబడి.. అబద్ధం చెప్పలేనే.. నా అద్దం అంటే నువ్వేమరీ.. ఆ నిజం దాచలేనే..’ అంటూ చంద్రబోస్ రాసిన అద్భుతమైన సాహిత్యాన్ని భీమ్స్ సిసిరోలియో స్వరపరచగా, శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ కలిసి ఆలపించారు. శ్రావ్యమైన రాగంతో, ఆహ్లాదకరమైన చిత్రణతో ఈ పాట సాగింది. పాటకు తగినట్టుగా రవితేజ, డింపుల్ హయాతి అందంగా అభినయించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల.