హైదరాబాద్, ఆగస్టు 27: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్..నోటిద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ ‘హిల్కాల్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వెల్కమ్ ట్రస్ట్, హిలమెన్ ల్యాబోరేటరీస్ నుంచి లైసెన్స్ పొందిన భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ హిల్కాల్ వ్యాక్సిన్లను తయారు చేయడానికి హైదరాబాద్‌తోపాటు భువనేశ్వర్‌లో ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు, వీటి ద్వారా ప్రతియేటా 20 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయబోతున్నట్లు భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా తెలిపారు.
అంతర్జాతీయంగా ఓరల్ కలరా వ్యాక్సిన్‌కు 10 కోట్ల డోస్‌ల డిమాండ్ ఉన్నదని, ఉత్పత్తి మాత్రం ఈ స్థాయిలో లేకపోవడంతో కొరత అత్యధికంగా ఉన్నది. మూడు దఫాలుగా పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతనే ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.
ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చినట్లు చెప్పారు. సింగిల్ డోస్ కలిగిన ఈ ఓరల్ వ్యాక్సిన్ 14 రోజుల్లో రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. 2023 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ప్రపంచవ్యాప్తంగా 31 దేశాల్లో 8,24,479 కలరా కేసులు నమోదు కాగా, 5,900 మంది మరణించినట్లు తెలిపారు.