జిల్లావ్యాప్తంగా 19,932 స్వయం సహాయక సంఘాలు.. 2,25,020 మంది సభ్యులు స్వయం సహాయక సంఘాల బలోపేతానికి రాష్ట్ర సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు వడ్డీలేని, స్వల్ప వడ్డీతో రుణాలు అందిస్తూ స్వయం ఉపాధి వైపు ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వ సంకల్పం మేరకు రంగారెడ్డి జిల్లా అధికారులు లక్ష్యానికి మించి రుణాలు పంపిణీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ.571 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో నవంబర్ నెల వరకు రూ.354 కోట్లు అందజేయాలని టార్గెట్‌గా పెట్టుకోగా.. లక్ష్యానికి మించి రూ.358.87 కోట్లు పంపిణీ చేశారు. ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 19,932 స్వయం సహాయక సంఘాలుండగా 2,25,020 మంది సభ్యులు ఉన్నారు. అయితే జిల్లాలో 99 శాతం ఎస్‌హెచ్‌జీలు రెగ్యులర్‌గా రుణాలను చెల్లిస్తుండగా కేవలం ఒక్క శాతం మాత్రమే పనిచేయని సంఘాలుగా డీఆర్డీఏ అధికారులు గుర్తించారు.
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 8 : మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంఘాలవారీగా కాకుండా వ్యక్తిగతంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలతోపాటు స్వల్ప వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నది. మహిళా సంఘాల సభ్యులు అధికంగా కిరాణ దుకాణాలను నిర్వహించేందుకు, గేదెలు, గొర్రెలు, మేకలను కొనుగోలు చేయడం, కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు రుణాలను తీసుకుంటున్నారు. అయితే రంగారెడ్డి జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసే రుణాల లక్ష్యాన్ని రూ.571 కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది రూ.314 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా లక్ష్యానికి మించి రూ.320 కోట్ల రుణాలను బ్యాంకర్లు అందజేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.358 కోట్ల రుణాలను ఎస్‌హెచ్‌జీలకు అందజేశారు. జిల్లావ్యాప్తంగా 19,932 స్వయం సహాయక సంఘాలుండగా 2,25,020 మంది సభ్యులున్నారు. ఎప్పటికప్పుడు రుణాలను చెల్లించి తిరిగి రుణాలు పొందుతూ రెగ్యులర్‌గా ఉన్న స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధిక ప్రాధాన్యతనిస్తూ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తోడ్పాటునందిస్తున్నది. జిల్లాలో 99 శాతం స్వయం సహాయక సంఘాలు రుణాలు పొందడంతోపాటు రెగ్యులర్‌గా చెల్లిస్తుండడంతో కేవలం 559 ఎస్‌హెచ్‌జీలు మాత్రమే పనిచేయని సంఘాలుగా డీఆర్డీఏ అధికారులు గుర్తించారు. ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తూ ఆర్థికంగా ఎస్‌హెచ్‌జీలు వృద్ధి చెందడంలో చేయూతనందిస్తున్నారు.
ఇప్పటివరకు రూ.358.87 కోట్ల రుణాలు
ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు 60 శాతానికిపైగా రుణాలను మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.571 కోట్లకు రూ.358.87 కోట్ల రుణాలను ఎస్‌హెచ్‌జీలకు అందజేశారు. నవంబర్ నాటికి రూ.354.32 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, లక్ష్యానికి మించి జిల్లాలో ఎస్‌హెచ్‌జీలకు రుణాలను అందజేశారు. నవంబర్ నాటికి జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు రూ.358.87 కోట్ల రుణాలను మంజూరు చేశారు. ఎన్పీఏ(పనిచేయని సంఘాలు)లకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 559 సంఘాలుండగా రూ.7.89 కోట్ల రుణాలు వసూలు చేయాల్సి ఉంది. అత్యధికంగా మొయినాబాద్ మండలంలో 202 సంఘాల నుంచి రూ.1.26 కోట్ల రుణాలు, యాచారంలోని 101 సంఘాల నుంచి రూ.80.14 లక్షలు, చేవెళ్లలోని 96 సంఘాల నుంచి రూ.84.43 లక్షలు, శంషాబాద్‌లోని 64 సంఘాల నుంచి రూ.1.20 కోట్లు, షాబాద్‌లోని 17 సంఘాల నుంచి రూ.78.46 లక్షలు, కందుకూరు మండలంలోని 15 సంఘాల నుంచి రూ.69.01 లక్షల రుణాలను వసూలు చేయాల్సి ఉంది.
వంద శాతం రుణాలు మంజూరు చేస్తాం – జంగారెడ్డి, డీఆర్డీవో ఏపీడీ
ఈ ఆర్థిక సంవత్సరం స్వయం సహాయక సంఘాలకు వంద శాతం రుణాలను మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతాం. ఇప్పటివరకు 60 శాతానికిపైగా రుణాలను మంజూరు చేశాం. ప్రభుత్వ చేయూతతో స్వయం సహాయక సం ఘాల సభ్యులు ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు.