e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 27, 2022
Home News ఎనకటికే బాగుండే

ఎనకటికే బాగుండే

 • అవసరమున్న మేరకు యాసంగిలో వరి..
 • వానకాలంలో చిరుధాన్యాలు..కూరగాయల సాగు
 • నీటి వనరులుపెరగడంతో వరిపైనే ఆసక్తి
 • అవగాహన లేక అమ్ముకునేందుకు అవస్థలు
 • ఇతర పంటలపై శ్రద్ధ పెట్టాలంటున్న పెద్దలు
 • ఎనకటి ఎవుసం బాగుందంటున్న రైతులు

అప్పుడంతా అర్కలు, జొన్నలే..

వ్యవసాయం అప్పట్లో చాలా కష్టంగా ఉండేది. అయినా ఇష్టంగా చేసేటోళ్లం.. బోర్లు లేవు, కరెంటు లేదు, వడ్లు తక్కువ, ఎక్కువగా వానకాలం పంటలుండేవి. వర్షాధారమే ఎక్కువ. అర్కలు, తైదలు, కొర్రలు, జొన్నలు, బుడ్డలు(వేరుశనగ), ఆముదాలు వేసేటోళ్లం. వరి తినేటోళ్లం కాదు.. కనుక తక్కువగా పండించేటోళ్లం. అర్కబువ్వ, జొన్న, సజ్జ రొట్టె, కొర్రలన్నం ఎక్కువగా తినేటోళ్లం. బావులలో మోట్లు ఉండేవి, పొద్దునపోతే సాయంత్రం దాక మోట్లు కొట్టేవాళ్లం. చెరువుల నీళ్లు, జాలు ద్వారా పంటలేసేది. నాకు 80 ఏండ్లు. వ్యవసాయం 16 ఏట నుంచే మొదలెట్నా. ఇప్పటిలా ఎరువులు, పురుగు మందులు లేవు. పొలంలో పశువుల పెంట (ఎరువు), ఒండ్రు కొట్టేవాళ్లం. పశువులు ఎక్కువగా ఉండేవి. ఆవుపాలు, బెల్లం చాయ తాగేవాళ్లం. నాటి జీవనం ఇప్పడు లేదు.

- Advertisement -

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, డిసెంబర్‌ 5(నమస్తే తెలంగాణ)/గద్వాల: భూములు చాలావరకు అన్ని పంటల సాగుకు అనుకూలం. అయినా రైతులు ఎక్కువగా వరి పంటపై ఆసక్తి చూపుతున్నారు. ఇంత వరకు అనేక కారణాల వల్ల వరిని ఎక్కువగా సాగు చేస్తూ వస్తున్నారు. గతంలో ప్రధానంగా రైతులు వర్షాధార, బోర్లపై ఆధారపడి వ్యవసాయం సాగు చేసే వారు. వర్షాధార పంటలు సాగు చేయడం వల్ల ఖర్చు తక్కువగా ఉండడంతోపాటు రైతులకు లాభాలు ఎక్కువగా వచ్చేవి అయితే కాలక్రమంలో రైతులు వర్షాధార పంటల వైపు ఆసక్తి పెంచకుండా ఇతర పంటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు నీరు వనరులు పుష్కలంగా ఉండడంతో రైతులు వర్షాధార పంటలు వేయకుండా వానకాలం, యాసంగి రెండు సమయాల్లో రెండు పంటలు వరి వేయడం వల్ల మార్కెట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి బదులుగా ఇతర పంటలైన వేరుశనగ, నూనెగింజలు, కూరగాయలు, పండ్ల వంటి లాభాల పంటలు రైతులు సాగు చేస్తే ఆదాయం పెరగడంతో పాటు రైతుకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.

ఆనాటి పంటలపై నేటి రైతులు ఆసక్తి ఏది

గతంలో రైతులు వర్షాధార పంటలపై ఆధారపడి పంటలు సాగు చేసే వారు. దీంతో పంటల సాగుకు ఖర్చు తక్కువ కావడంతో పాటు ఎరువుల,కూలీల ఖర్చు తక్కువగా ఉండేది. పండించిన ధాన్యానికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడంతో రైతులకు ఎక్కువగా లాభాలు వచ్చేవి. 30ఏండ్ల కిందట రైతులు ప్రజలకు నిత్యం ఉపయోగపడే పంటలు సాగు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. వేరుశనగ, పప్పుశనగ, పొగాకు, మొక్క జొన్న కుసుమ, పత్తి, ఆముదం, పొద్దుతిరుగుడు ఆవాలు, నువ్వులు, మినుములు, కొర్రలు, సజ్జలు, జొన్నలు, పెసర్లు, కంది, ఆలసందలు తదితర పంటలు సాగు చేసేవారు. ఈ పంటలకు పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువగా వచ్చేవి అయితే ఇందులో ప్రస్తుతం రైతులు ఎక్కువగా వరి,పత్తి మాత్రమే పండించడంతో ఇతర ధాన్యాల ధరలు మార్కెట్‌లో రోజుకు పెరిగి పోతున్నాయి. రైతులు ఈదిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.

గత పంటలే ఆరోగ్యానికి మేలు

గతంలో సామలు, కొర్రలు, సజ్జలు ఎక్కువగా వేసేవాళ్లం. వీటితో ఆరోగ్యంగా ఉండేటోళ్లం. ఎలాంటి రోగాలు ఉండేవికావు. ఇప్పుడు ఎరువులతో పంటలు సాగు చేయడంతో కీళ్ల నొప్పులతో పాటు ఎన్నో రకాల రోగాలు వస్తున్నాయి. గతంలో వేసిన పంటలకు ఇప్పుడు మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంది. మూడు, నాలుగు నెలలు పంటలు సాగు చేయడంతో వాటిపై రైతులు ఎక్కువ శ్రద్ధపెడుతున్నారు. రాగులు, జొన్న సాగు చేస్తే ఆరోగ్యానికి మంచిది.

 • కొండన్న, రైతు, హన్వాడ

మందులు లేకుండా పంటలు సాగు

వెనుకటికి ఆరుతడి పంటలు మందు మాకు లేకుండా పండించాం. ఇప్పుడు మార్కెట్‌లో హైబ్రీడ్‌ విత్తనాల రాకతో రసాయన మందులు వాడితేనే పంటలు చేతికి వస్తున్నాయి. గతంలో మిరప, మొక్కజొన్న, వాము, శనగ, జొన్న, సజ్జ, నూలు పంటలు ఎక్కువ మంది రైతులు సాగు చేసేటోళ్లం. వీటికి పెట్టుబడి తక్కువ. ఇప్పుడు పునాస పంటలు సాగు చేసేందుకు రైతులు వెనుకాడుతున్నారు. ప్రస్తుతం ఈ పంటలకు డిమాండ్‌ ఉన్న కొనే వాళ్ల లేక పోవడంతో ఈ పంటలు సాగు చేయడం లేదు. సర్కార్‌ సజ్జ, జొన్న, కొర్ర, మినుము, వాము పంట దిగుబడిని కొనుగోలు చేస్తే రైతులు సాగు చేయడానికి ఆసక్తి చూపుతారు.

 • మెక్కెరప్ప, రైతు పులికల్‌

జొన్న సంకటి తినేటోళ్లం..

ఎక్కడ చూసిన ఎక్కువ శాతం వడ్లు పండిస్తుండ్రు. చిన్నప్పుడు జొన్న సంకటి, కొర్ర బువ్వ ఎక్కువగా తినేటోళ్లం. అప్పటి తిండి తినడంతో నాకు 62 ఏండ్లు దాటినా బీపీ, షుగర్‌ రోగం లేదు. రోజు పొలం పోయి వ్యయసాయం పనులు చేస్తున్నా. ఇప్పటి తిండితో చిన్న చిన్న పిల్లలకు తెలియని రోగాలు వస్తున్నయి. వరి దండగ పంట. వడ్లు పండించుడు ఇప్పటి నుంచైనా సాల్‌ చేస్తే మంచిది. ఇతర ఆరుతడి పంటలు చాలా ఉన్నయి. అవి సాగు చేస్తే డిమాండ్‌ కూడా ఉంటుంది.

 • దేశాయ్‌ పాషా, రైతు, ఊట్కూర్‌

తీరొక్క పంటలు సాగు చేసినం..

ఎనకటికి తీరొక్క పంటలు సాగు చేసినం. వరి పంటలతో పాటు పత్తి, మిరప, వేరుశనగ, కంది పంటలు పండించినం. అయినా నష్టాలు చవి చూసినం. వరి సాగు చేయడంతో నష్టాలు వస్తుండటంతో మార్కెట్‌లో డిమాండ్‌ గల పంటలు సాగు చేయాలని నిర్ణయానికి వచ్చినం. ప్రస్తుతం నాకున్న ఆరెకరాల్లో అన్నటో పంటను సాగు చేశా. ఏపీలో అన్నటో పంటకు మంచి గిరాకీ ఉందని తెలుసుకున్న. ఆరుతడి పంట కావడం. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని గ్రహించి రెండేండ్ల కిందట పంట సాగు చేశా. ఈ ఏడాది పంట చేతికొచ్చింది. మరో నెల రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. ఈ ఏడాది జిల్లాలోనే మొట్ట మొదటగా అన్నటో పంటను సాగు చేశా.

 • ఓబుల్‌రెడ్డి, రైతు, అయిజ

గతంలో వరి సాగు తక్కువే

మా కాలంలో బోరు,బావుల కింద ఒక పంట మాత్రమే వరి సాగు చేసే వాళ్లం. అది కూడా మా కుటుంబానికి సరిపడా మాత్రమే సాగు చేసేవాళ్లం. వానకాలం కొర్రలు, జొన్న, పెసర్లు, పొద్దుతిరుగుడు, వేరుశనగ, పత్తి, కుసుమ, అనుములు ఎక్కువగా సాగు చేసేవాళ్లం. దీంతో పెట్టుబడి తక్కువ రైతులకు లాభాలు ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు ఎక్కువగా వరి పంటపై ఆసక్తి చూపుతూ ఇతర పంటలు సాగు చేయడం లేదు. దీంతో ఇతర పటంలకు డిమాండ్‌ పెరిగి, వరికి మాత్రం మద్దతు ధర రావడం లేదు. వరి సాగుకు పెట్టుబడి ఎక్కువ లాభాలు తక్కువ. కొర్రన్నం, జొన్న రొట్టెలు తినడం వల్ల మేము ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటున్నాం. రైతులు ప్రస్తుత పరిస్థితిలో ఇతర పంటల వైపు మరలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 • హుసేనప్ప ,రైతు, గువ్వలదిన్నే

అప్పట్ల పండించిందే తినేవాళ్లం

నాకు 75 ఏళ్లు. మాకు ఐదు ఎకరాల పొలం ఉంది. 50 ఏళ్ల కిందట ఇంట్లో మేం పండించిన పంటనే తినేటోళ్లం. కందులు, పెసలు, పెబ్బర్లు, పల్లీ, సెనగలు, మినుములు, జొన్నలు, సొద్దలు, రాగులు ఇంట్ల ఎప్పుడూ నిల్వ ఉండేవి. పంట సాగు చేసేటప్పుడే నాలుగు సాళ్లు కందులు వేస్తే మధ్యలో చిరుధాన్యాలు, ఇతర పప్పుదినుసులు సాగుచేసేటోళ్లం. అప్పుడు బియ్యం అనే మాటే చాలా అరుదు. బాగా నీళ్లు ఎక్కువ ఉన్న చోట మాత్రం వడ్లు పండించేది. మేం జొన్న సంకటి, కొర్ర సంకటి తినేది. అందుకే మాకు ఇప్పటికీ బీపీ, షుగర్‌ లాంటి జబ్బులు సమస్యలు లేనేలేవు. ఇప్పుడు అందరూ సులభమైన వ్యవసాయం అని వరి పండిస్తున్నరు. మా కాలంలో ఉదయం ఏడు గంటలకు జొన్న సంకటి లేదా జొన్న రొట్టెలు కడుపునిండా తిని చేను కాడికి పోతే… మధ్యాహ్నం రాగి అంబలి తాగి సాయంత్రం వరకు పనులు చేసే వాళ్లం. సాయంత్రం ఇంటికి వచ్చి ఇప్పటిలా కాకుండా త్వరగా తిని పడుకునే వాళ్లం. అప్పుడు మాకు టీవీలు, సెల్‌ ఫోన్లు, ఫోన్లు ఇలాంటివేమీ లేవు. ఒకరి పొలం వద్ద పని ఉంటే మరొకరు వచ్చి సాయం చేసే అవకాశం ఉండేది. ఇక పండించిన పంటను అమ్ముకునేందుకు ఎద్దుల బండి మీద పాలమూరు వరకు పోయే వాళ్లం. అప్పుడు ట్రాక్టర్లు, లారీలు మాకు తెలవదు. పగలనక రాత్రనక కష్టపడి పని చేయడం మాత్రం తెలుసు. అప్పుడు ఏ పంట పండించినా అవసరం అయితే రైతులను మార్చుకునేవాళ్లం. పప్పు దినుసులు, చిరుధాన్యాలు ఏ రోజు అంగడికి పోయి కొనింది లేదు. కందుల నుంచి మేమే కందిపప్పు తయారు చేసుకునే వాళ్లం. ఎంతో అద్భుతమైన రుచి ఉండేది. ఇప్పుడెక్కడ… అన్ని కిరాణా షాప్‌ కు పోయి కొనడమే అయింది. అప్పుడు మేము కష్టపడి పని చేశాము… మంచి తిండి తిన్నాం. ఇప్పుడంతా వరి అన్నం తిని పొట్ట పెంచుతున్నారు. ఈ తరం వాళ్లకు శారీరక శ్రమ లేక స్థూలకాయం వస్తోంది. బీపీ, షుగర్లు ఉన్నాయి. నాకు 75 ఏండ్లయినా ఇప్పటికీ ఎలాంటి రోగాలు రాలేదు. అందుకే ఒళ్లొంచి వ్యవసాయం చేయడంతోపాటు మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటరు. వడ్లు పండించి లాభాలు రావడం లేదు అంటే ఎట్లా… అప్పుడు మేము సాగు చేసినట్లు పప్పుదినుసులు చిరుధాన్యాల మీద దృష్టి పెడితే వ్యవసాయం లాభసాటిగా ఉంటది.

 • కనకప్ప, రైతు, బండ్రవల్లి, సీసీ కుంట మండలం, మహబూబ్‌నగర్‌ జిల్లా

పాత కాలం పంటలే మేలు

నాకున్న 11ఎకరాల్లో 9ఎకరాల్లో పత్తి పంట, రెండెకరాల్లో జొన్న పంట వేసిన. నా చిన్నతనంలో శనగ పంటతో పాటు పొలంలో కందులు, పెసర్లు, నువ్వులు, ఉలువలు, అనుములు, అలుచందలు పండించెటొళ్లం. రాను రాను కాలం మారినట్ల పంటలు కూడా మారినయి. ఎక్కడ చూసినా జనం నడుమొంచి పని చేయకుండా వడ్లు పండిస్తే సాలనుకుంటున్నరు. ఒక్క వడ్లు పండిస్తే మిగతావన్నీ బయట నుంచి కొనుడే అయితుంది. ఏమైనా తిరిగి పాత కాలం పంటలు పండిస్తేనే బర్కత్‌ ఉంటది. అవి తింటే మనిషికి ఇంత బలమన్న వస్తది. అందరు పండిస్తే నేను కూడా పాత కాలం పంటలనే పండించాలని ఉంది.

 • కుర్వ జాజాపురం బాలప్ప, రైతు, ఊట్కూర్‌

రకరకాల పంటలు వేసినం

గతంలో వ్యవసాయం పొలంలో రకరకాల పంటలు వేసినం. ఇప్పటికంటే అప్పటి రోజులే బాగున్నాయి. పొలంలో రకరకాల పంటలు పండించే వాళ్లం. పొలానికి పోతే కండ్ల సంబురంగా ఉండేది. 3ఎకరాల పొలం ఉంటే కొద్దిగంత వరి, మిగిలిన దాంట్లో పప్పుదినుసులు, కంది, పెసర, వేరుశనగ వేసుకునేది. శల్కలైతే ఆముదాలు, జొన్నలు వేసేవాళ్లం. యాసంగి పంటలు మార్చి వేయడం వల్ల రైతులకు మేలు జరిగేది. ఇయ్యాలా ప్రభుత్వం మళ్లా యాసంగిలో ఆరు తడి పంటలు వేయమని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. పంట మార్పిడి చేస్తేనే రైతులకు, భూమికి, మేలు. వేర్వేరు రకాల పంటలు పండిస్తేనే నేల కూడా బాగుంటుంది. కనీసం యాసంగిలైనా పంట మార్పిడి చేస్తే అందరికీ మేలు.

 • వస్పుల శంకరయ్య, రైతు, వనమోనిగూడ, బాలానగర్‌
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement