బెంగళూరు : గత నెలలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యానిదే తప్పు అని కర్నాటక ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జూన్ 3న ముగిసిన ఐపీఎల్-18 ఫైనల్లో 18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ టైటిల్ గెలిచింది. కానీ ఆ జట్టు విజయోత్సవ పరేడ్‌కు సంబంధించి ఫార్మాట్ ప్రకారం అనుమతులు తీసుకోలేదని నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. ఆర్సీబీ యాజమాన్యం విక్టరీ పరేడ్ గురించి పోలీసులకు సమాచారం మాత్రమే ఇచ్చింది తప్ప సరైన అనుమతులు తీసుకోలేదు. సాధారణంగా ఇలాంటి వేడుకలకు పోలీసుల నుంచి ఏడు రోజుల ముందు పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఆర్సీబీ మాత్రం తమ విజయోత్సవ వేడుకలపై పోలీసులకు ఎలాంటి సమాచారమివ్వకుండానే జూన్ 4న ఉదయం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో వీడియో చేయించడంతో ఈ కార్యక్రమానికి వచ్చేందుకు జనం ఎగబడ్డారు.
చిన్నస్వామి సామర్థ్యం 35 వేలు మాత్రమే అయినప్పటికీ సుమారు 3 లక్షల మంది జనం రావడం తొక్కిసలాటకు కారణమైంది. నిర్వాహకులకు కార్యక్రమం గురించి సరైన ప్రణాళికలు లేకపోవడం, అధికారులకు ముందస్తు సమాచారం అందించడంలో వైఫల్యమే ఈ ఘటనకు కారణమని ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. ఇదిలాఉండగా ఈ నివేదికపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్సీబీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి (సిద్ధరామయ్య), ఉప ముఖ్యమంత్రి (డీకే శివకుమార్) కూడా ప్రజలను విజయోత్సవాలకు రావాలని ఆహ్వానించారని.. కానీ ఇప్పుడు కోహ్లీ, ఆర్సీబీ మీద నిందలు వేస్తున్నదని బీజేపీ నాయకుడు అరవింద్ బెల్లాడ్ విమర్శించారు. ఒకవేళ ఆర్సీబీ యాజమాన్యమే ఘటనకు కారణమయ్యుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు అధికారులను ఎందుకు సస్పెండ్ చేసిందని ఆయన ప్రశ్నించారు.