పల్లె నుంచి పట్నం వరకు.. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు.. ప్రతి ఒక్కరినీ అలరిస్తూ ఏడు సీజన్లుగా అలుపెరుగక సాగుతున్న ప్రొ కబడ్డీ లీగ్ మరోసారి మన ముందుకు రానున్నది. మట్టి కోర్టు నుంచి మ్యాట్‌పైకి చేరి ప్రసార మాధ్యమాల ద్వారా ఇంటింటికి చేరువైన గ్రామీణ క్రీడ.. ఎనిమిదో సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కరోనా కొత్త వేరియెంట్ భయాల నేపథ్యంలో పూర్తి బయోసెక్యూర్ వాతావరణంలో జరుగనున్న ఈ సీజన్లో.. 12 జట్లు ఒకే వేదికపై తలపడనున్నాయి. మరింకెందుకు ఆలస్యం రైడర్ల కూతలు.. డిఫెండర్ల మోతలకు మీరు సిద్ధమైపోండీ..!
బెంగళూరు: దేశంలో ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన లీగ్‌గా గుర్తింపు సాధించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 8వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. కరోనా కారణంగా ప్రత్యేక పరిస్థితుల్లో జరుగనున్న ఎనిమిదో సీజన్ తొలి దశకు బుధవారం తెరలేవనుంది. ప్రేక్షకులను అనుమతించకుండా ఒకే వేదికపై 12 జట్లు తలపడనుండగా.. తొలి నాలుగు రోజులు మూడేసి మ్యాచ్‌లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. తొలి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో యూ ముంబా తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక మూడో మ్యాచ్‌లో యూపీ యోధాతో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ అమీతుమీ తేల్చుకోనుంది. బుధవారంతో ప్రారంభమై జనవరి 20తో ముగియనున్న తొలి దశలో మొత్తం 66 మ్యాచ్‌లు జరుగనుండగా.. రౌండ్ రాబిన్ పద్ధతిలో ప్రతి జట్టు మిగిలిన పదకొండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతాయి.
సమతూకంగా హైదరాబాద్..
అనుభవానికి యువరక్తాన్ని జోడిస్తూ.. తాజా వేలంలో తెలుగు టైటాన్స్ మంచి జట్టును ఎంపిక చేసింది. రోహిత్ కుమార్ సారథ్యం వహిస్తున్న ఈ జట్టులో సిద్ధార్థ్ దేశాయ్ రూపంలో స్టార్ రైడర్ అందుబాటులో ఉన్నాడు. సిద్ధార్థ్ రాణించడంపైనే టైటాన్స్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. లీగ్‌లో తొలిసారి అవకాశం దక్కించుకున్న తెలంగాణ యువ రైడర్ గల్లా రాజు సత్తాచాటాలని చూస్తున్నాడు.