జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
కాచిగూడ, జనవరి 25: జనగణనలో కులగణన కోసం ప్రతిపక్ష పార్టీలు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జబ్బాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఏపీలోని మదనపల్లిలో నిర్వహించిన బీసీ మహాసభలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కులగణన సాధ్యంకాదని కేంద్రం అఫిడవిట్ ఫైల్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. దేశ ప్రధాని బీసీ అయి ఉండి బీసీలకే తీవ్ర అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు 14 శాతం ప్రాతినిధ్యం మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఉద్యోగులకు క్రీమీలేయర్ విధానాన్ని రుద్దాలని చూస్తున్నదని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రేవన్న, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు శ్రీనివాస్, సురేశ్, లాల్ కృష్ణ, వివిధ రాష్ర్టాల ప్రతినిధులు పాల్గొన్నారు.