హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): స్థానికత నిబంధనలను సవరించాలని బీసీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ నిరంజన్ సూచించారు. ఖైరతాబాద్‌లో ఉన్న కమిషన్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన సభ్యులు జయప్రకాశ్, సురేందర్, బాల లక్ష్మి, కమిషన్ మెంబర్ సెక్రటరీ బాల మాయాదేవి శనివారం సమావేశమయ్యారు. తెలంగాణలో పుట్టి, 10వ తరగతి వరకు ఇక్కడే చదివినా, ఇంటర్ ఇతర ప్రాంతాల్లో చదివారనే కారణంగా ఓ విద్యార్థినిని స్థానికుడు కాదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కమిషన్ చర్చించింది.
ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో సవరణ తేవాల్సిన అవసరమున్నదని ప్రభుత్వానికి సూచించింది. బీసీ జాబితా నుంచి తొలగించిన కులాల పేరిట జారీచేసిన కులధ్రువీకరణ పత్రాలపై సీసీఎల్ఏ కార్యదర్శి వెంకట్‌తో చర్చించారు. రెండు నెలల్లోగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలని ఆదేశించారు. పంబాల కుల సర్టిఫికెట్ల జారీ అంశంపై తహసీల్దార్లు, సామాజికవర్గంవారితో మాట్లాడి వివరాలను రికార్డు చేసింది. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆగడాలపై 7న నిజామాబాద్ కలెక్టరేట్లో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. లొద్ద సామాజికవర్గం స్థితిగతులపై అధ్యయనం కోసం సెస్ సంస్థ ద్వారా ప్రత్యేక సర్వే చేయించాలని కమిషన్ నిర్ణయించింది.