నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 3 : ఓ వైపు పంటలు ఎండిపోతున్నా కరెంటియ్యరా? అని రైతులు సర్కార్‌పై మండిపడుతున్నారు. వానలు లేక ఓవైపు.. కరెంట్ లేక ఇంకోవైపు పంటలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్ కోతలను నిరసిస్తూ శనివారం రైతులు అనేక జిల్లాల్లో రోడ్డెక్కారు. సబ్స్టేషన్లను ముట్టడించారు. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన తెలిపారు. కరెంట్ కోతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు మెదక్ జిల్లా రామాయంపేటలోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. సబ్‌స్టేషన్ ఎదుట ఎల్కతుర్తి-మెదక్ జాతీయ రహదారిపై రెండుగంటలపాటు రైతులు రాస్తారోకో చేపట్టారు. రోజుకు కనీసం నాలుగు గంటలు కూడా కరెంట్ సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లోవోల్టేజీ లేకుంటే హైవోల్టేజీతో వస్తుండటంతో బోరుమోటర్లు కాలిపోతున్నాయని వాపోయారు.
అక్కడికి వచ్చిన ట్రాన్స్‌కో ఏఈపై మండిపడ్డారు. కరెంట్ కోతలపై నిలదీసేందుకు రైతులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని సెస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఏఈ అందుబాటులో లేకపోవడంతో వారు అక్కడే నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేట సబ్‌స్టేషన్ వద్ద కలికోట రైతులు ఆందోళనకు దిగారు. అనంతరం ఏఈ అశోక్‌కు వినతిపత్రం అందజేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలంలోని చెందోలి రైతులు రోడ్డెక్కారు.
వారం రోజులుగా విద్యుత్తు సరిగా రాకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయని, లోఓల్టేజీతో మోటర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల-ధర్మారం ప్రధాన రహదారిపై దాదాపు 70కిపైగా మంది రైతులు బైఠాయించారు. ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, ఏఈ రాకేశ్ హామీ మేరకు ఆందోళన విరమించారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం మునిమోక్షం గ్రామంలోని సబ్‌స్టేషన్‌ను శనివారం రాత్రి రైతులు నిరసన తెలిపారు. వరి పంట పొట్టదశలో ఉన్నదని, ఈ సమయంలో నీటి తడులు అందించకుండా కరెంట్ కోతలు వేధిస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నదన్నారు.
ఇప్పటికైనా కోతలు లేకుండా కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కరెంట్ కోతలను నిరసిస్తూ కామారెడ్డి బిచ్కుంద మండలం శాంతాపూర్ గేటు వద్ద 161వ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. శాంతాపూర్, సీతారాంపల్లి, రాజాపూర్, మాన్యాపూర్, జగన్నాత్పల్లి చౌరస్తా తదితర గ్రామాలకు చెందిన రైతులు శాంతాపూర్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కరెంట్ సక్రమంగా సరఫరా చేయకపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ హైవేపై బైఠాయించారు.
పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టీ) సబ్‌స్టేషన్ ఎదుట రైతులు నిరసన తెలిపారు. దాదాపు 150 మందికిపైగా రైతులు ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్‌లో రోజువారీ కరెంటు సరఫరా రిజిస్టర్‌ను పరిశీలించారు. ఎస్ఈ జాదవ్ సుభాష్, ఏఈ శ్రీనివాస్‌లకు ఫోన్ ద్వారా సమస్యను విన్నవించారు. 24 గంటల కరెంటేమో కానీ.. కనీసం ఐదు గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గేటు వద్ద జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టీ) సబ్‌స్టేషన్ వద్ద తహసీల్దార్ రమేశ్‌నాయక్‌కు వినతిపత్రం అందిస్తున్న రైతులు

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చెందోలిలో రాస్తారోకో చేస్తున్న రైతులను సముదాయిస్తున్న ఎస్సై కృష్ణసాగర్రెడ్డి

మెదక్ జిల్లా రామాయంపేటలో మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు