హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ)/తెలుగు యూనివర్సిటీ : దేశ జనాభాలోని ఓబీసీల సంఖ్య తేల్చాలని, అందుకు జాతీయ జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని, అందుకు పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర ఇప్పటికే తమ పార్టీ అనుకూలమని రాజ్యసభలో ప్రకటించడంతోపాటు కేంద్రం వైఖరిని ఎండగట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
జాతీయ ఓబీసీ కో ఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు ఓబీసీ ప్రజాప్రతినిధుల ఫోరం, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్తాధ్వర్యంలో శనివారం గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద.. జాతీయ జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలని పలు దఫాలుగా జాతీయ స్థాయిలో ఓబీసీ సంఘాలు డిమాండ్ చేసినా మొండివైఖరితో కేంద్రం విడుదల చేసిన జీవో కాపీలను చింపేసి పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. జనగణనలో ఓబీసీ ప్రత్యేక కాలమ్ పెట్టకుండా కేంద్రం చేస్తున్న సర్వేను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కులానికి సంబంధించిన జనాభా వివరాలను శాస్త్రీయంగా నమోదు చేసేంతవరకూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఓబీసీల జనా భా ప్రత్యేకంగా నమోదు చేసేందుకు ఓబీసీ కాలమ్ చేర్చేంతవరకూ దేశవ్యాప్త ఉద్యమాన్ని బలోపేతం చేసి సాధించుకుంటామని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు తెలిపారు. ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటుచేసేంతవరకూ పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్‌గౌడ్, వైస్ చైర్మన్ దుర్గయ్య , కన్వీనర్ అయిలి వెంకన్న తమ ప్రసంగంలో వివరించారు. నిరసనలో బీసీ సంఘాల నాయకులు వట్టె జానయ్యయాదవ్, ఎర్ర సత్యనారాయణ, బైర శేఖర్, అంబాల నారాయణగౌడ్, దామోదర్‌గౌడ్, బార్అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌గౌడ్, లింగంయాదవ్, నీరజగౌడ్, సుదర్శన్ పాల్గొన్నారు.