హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తేతెలంగాణ): సైబర్ నేరాల బారినపడిన పిల్లలకు న్యాయం చేయడంతోనే న్యాయవ్యవస్థ బాధ్యత ముగియదని, వారు మళ్లీ సాధారణ జీవితం గడిపేలా పునరావాసం కల్పించడం అంతే ముఖ్యమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఉద్ఘాటించారు. ఆన్లైన్లో చిన్నారులకు న్యాయం అందించడం, వారి భద్రత, లైంగిక దోపిడీ నివారణ, చిన్నారుల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం లాంటి అంశాలపై హైదరాబాద్‌లో జాతీయ న్యాయసేవాధికార సంస్థ (నల్సా), రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ర్టాల ప్రాంతీయ సదస్సులో శనివారం ఆయన ప్రసంగించారు.
ఆన్లైన్ నేరగాళ్ల బారిన పడినప్పుడు చిన్నారులు ఎలా సహాయం పొందాలో తెలియజేయాలని సూచించారు. పిల్లలు తమకు ఎదురైన అనుభవాలను వెల్లడించినప్పుడు అండగా నిలువాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉన్నదని చెప్పారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థలు, పోలీస్ విభాగం, బాలల సంక్షేమ కమిటీలు, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 మధ్య సమన్వయం ఉండాలని పేరొన్నారు. బాలలకు అనుకూలమైన రీతిలో ‘నల్సా’ రూపొందించిన న్యాయసేవల పథకం-2024 ద్వారా శిక్షణ పొందిన న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్ల సేవలను ప్రతి జిల్లాలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
చిన్నారుల ఎదుగుదలకు అవకాశాలు కల్పించడమే న్యాయవ్యవస్థ లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. పిల్లలపై జరిగే సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం అందించడం, బాలల ఆన్లైన్ భద్రత కోసం రాష్ట్రంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. ఇంటర్నెట్లో పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవాలని, పిల్లలు ఏమైనా పొరపాట్లు చేస్తే వారిని భయపెట్టకుండా ప్రేమతో, ఆప్యాయతతో మాట్లాడాలని సూచించారు.
ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ విక్రమ్‌నాథ్ మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాలు బాలల గోప్యతను కాపాడేలా మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. డిజిటల్ ప్రపంచం చిన్నారుల అభ్యాసన, సృజనాత్మకత, భావవ్యక్తీకరణకు ఉపయోగపడాలే తప్ప దోపిడీకి సాధనంగా మారకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ మహదేవన్ పేరొన్నారు. సాంకేతికత విస్తరిస్తున్న కొద్దీ బాలలపై కొత్త తరహా నేరాలు జరుగుతున్నాయని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికత ఎంత అభివృద్ధి నప్పటికీ బాలల హకులు, గౌరవానికి భంగం వాటిల్లకూడదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ పేరొన్నారు.
ప్రజలకు న్యాయసేవలను మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన మొబైల్ లోక్ అదాలత్ వాహనాలను సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి ప్రారంభించారు. ‘న్యాయరథం-గడప ముంగిటకు న్యాయం’ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ వాహనాల ద్వారా ప్రజలకు వారి ప్రాంతాల్లోనే న్యాయసేవలు, లోక్‌అదాలత్ అందించనున్నారు. న్యాయసేవల కోసం దూరప్రాంతాల నుంచి కార్యాలయాలకు రావాల్సిన అవసరాన్ని తగ్గించడం న్యాయరథం ఉద్దేశం.
బాలల భద్రత, గౌరవం, రక్షణ పట్ల అన్ని వ్యవస్థలు, భాగస్వాముల ఉమ్మడి సంకల్పానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన ‘కమిట్మెంట్ వాల్’ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ బీ నరసింహశర్మ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ శ్యాంకోశీ, సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి, న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి, జిల్లా జడ్జిలు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.