ఖైరతాబాద్, నవంబర్ 25: కేంద్రం మెడలు వంచైనా బీసీల కులగణన చేయిస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. 2021లో చేపట్టనున్న జనాభా లెక్కింపు ప్రక్రియలో బీసీలను లెక్కించాలన్న ప్రధాన డిమాండుతో డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన చలోఢిల్లీ పోస్టర్‌ను సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మణిమంజరి, ఉద్యోగుల సంఘం మహిళా అధ్యక్షురాలు గంగాపురం పద్మ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మాదేశి రాజేందర్‌తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 13న ఢిల్లీలో జంగ్ సైరన్, 14న పార్లమెంటు ముట్టడి, 15న జాతీయస్థాయిలో కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలతో కాన్స్టిట్యూషన్ క్లబ్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. బీసీలతో గోక్కుంటే రైతు చట్టాల విషయంలో చేతులు కాల్చుకున్నట్టే అవుతుందన్నారు. కోర్టులు సైతం జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లు కల్పించలేమని చెబుతున్నాయని అన్నారు.
తమకు సైంటిఫిక్ డాటా కావాలని, జనాభా ఎంత, విద్యా, ఉద్యోగాల్లో వాటా, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ మేరకు న్యాయం చేశారో చెప్పాలని, కులగణనలో 33వ కాలమ్ పెట్టి కులం కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ తదితర రాష్ర్టాల అసెంబ్లీలు బీసీ కులగణనపై తీర్మానం చేశాయని గుర్తుచేశారు. దేశంలోని 20 రాజకీయ పార్టీలు బీసీ కులగణనకు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో సంఘం యువజన విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థి సంఘం అధ్యక్షుడు నర్సింహ నాయక్, ఓయూ కార్యదర్శి రాజేశ్ పటేల్, బీ రాజు తదదితరులు పాల్గొన్నారు.