దామరచర్ల, మార్చి 19: ఈ నెల 13న దామరచర్ల రైల్వే క్వార్టర్ సమీపంలో జరిగిన లింగరాజు హత్యకేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నందుకే లింగరాజును అతడి బావమర్ది హత్య చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం వాడపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తున్న లింగరాజుకు 12 ఏండ్ల క్రితం దామరచర్లకు చెందిన మల్లీశ్వరీతో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. లింగరాజు భార్యపై అనుమానంతో ఆమెను వేధించేవాడు. ఆమె విషయాన్ని తన పుట్టింటి వారికి చెప్పి బాధపడేది. తన అక్క మల్లీశ్వరిని బాధపెట్టొద్దని ఆమె తమ్ముడు చెవుల వెంకటేశ్ పలుమార్లు లింగరాజును హెచ్చరించాడు. అయినప్పటికీ లింగరాజు మారక పోగా మద్యానికి బానిసై వేధింపులు అధికం చేశాడు. ఈ నెల 11న మల్లీశ్వరికి సమభావన సంఘం నుంచి డబ్బులు రాగా ఈ విషయంలో లింగరాజు ఆమెతో గొడవ పడి కొట్టాడు. దాంతో ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని తమ్ముడికి చెప్పగా.. బావను చంపాలని నిర్ణయించుకున్నాడు. అదును కోసం ఎదురు చూస్తుండగా ఈ నెల 12వ తేదీ రాత్రి వాటర్ ట్యాంకు వద్ద లింగరాజు మద్యం మత్తులో వెంకటేశ్‌కు తారస పడ్డాడు. అతడిని తన బైక్‌పై ఎక్కించుకొని గ్రామ శివారులోని రైల్వే క్వార్టర్ వద్దకు తీసుకెళ్లిన వెంకటేశ్ అతడికి మరింత మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న లింగరాజును అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిన అతను విషయాన్ని అక్క మల్లీశ్వరికి చెప్పి ఆమెను తీసుకొని తిరిగి లింగరాజు ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. మల్లీశ్వరి సెల్‌ఫోన్‌లోని లైట్ వేసి చూపుతుండగా.. మద్యం మత్తులో ఉన్న లింగరాజు తలపై వెంకటేశ్ పెద్దబండరాయి వేశాడు. బైక్‌లో ఉన్న స్క్రూడ్రైవర్‌తో అతడి ముఖంపై మూడుసార్లు పొడిచి, బ్లేడ్‌తో గొంతు కోశాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్క, తమ్ముడు కలిసి మృతదేహాన్ని కొద్ది దూరం లాక్కెళ్లి.. అక్కడ పడేసి పరారయ్యారు. హత్య జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు ఇందులో కుటుంబ సభ్యుల పాత్ర ఉందని అనుమానించి మల్లీశ్వరితో పాటు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా వివరాలు వెల్లడించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన స్క్రూడ్రైవర్, బండరాయితో పాటు వారి నుంచి మొబైల్, పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో రూరల్ సీఐ సత్యనారాయణ, వాడపల్లి ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు.