హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : బాసర ఆర్జీయూకేటీ అడ్మిషన్ల దరఖాస్తులకు కొత్త చిక్కు వచ్చింది. అపార్ కష్టాలు వచ్చిపడ్డాయి. బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తు చేసే సమయంలో అపార్ నంబర్ అడుగుతున్నారు. అయితే సర్కారు బడుల్లోని విద్యార్థులు కొందరికి అపార్ నంబర్ జనరేట్కాలేదు.
ఆధార్ కార్డులో తప్పులుండటం, పేరులో అక్షర దోషాలుండటంతో అపార్ జనరేట్ కాలేదు. 550 మార్కులు సాధించినా కూడా అపార్ లేకపోవడంతో కొందరు విద్యార్థులు ఆర్జీయూకేటీలో అడ్మిషన్లు పొందేందుకు దరఖాస్తు చేయలేకపోతున్నారు. తప్పులు సవరించేందుకు ఆధార్ సెంటర్లకు వెళ్తే పదోతరగతి మెమోలు వచ్చాక ఆధార్లో మార్చుతామంటున్నారు. పదో తరగతి మెమోలు రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశముంది.