తాండూర్ : మండలంలోని బోయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బర్లగూడెం ( Barlagudem ) గ్రామస్థులకు సరైన రహదారి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే ముళ్లపొదలు, ఇరుకైన రైల్వే బ్రిడ్జి అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బర్లగూడెం నుంచి ద్వారకాపూర్ గ్రామానికి వెళ్లాలంటే రాముని చెరువు అలుగు చెరువు కట్ట ముళ్ల పొదలు అడ్డు రావడంతో అటువైపు రవాణా స్తంభించిపోయింది.
నేషనల్ హైవే సమీపంలోని బోయపల్లికి రావాలంటే ఇరుకైన గుహలాంటి రైల్వే అండర్ బ్రిడ్జి ( Railway underbridge ) కింది నుంచి వెళ్లాల్సి వస్తోంది. కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్లే ఈ అండర్ బ్రిడ్జిలో నీరు నిలిచి బురదమయం కావడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారి సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయ అవసరాలు, నిత్యవసర సరుకుల రవాణా, స్కూల్ పిల్లల చదువులకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బర్లగూడెం ఆమ్లెట్ గ్రామ పరిసరాల్లో మదనాపూర్, ద్వారకాపూర్, బోయపల్లి, కత్తర్ల శివార్లకు చెందిన 300 ఎకరాల ఆయకట్టు ఉంది. పంట ఉత్పత్తుల రవాణా వ్యవసాయ పనులకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బర్లగూడెం రహదారి గుండానే వెళ్లాల్సి వస్తుంది. బర్లగూడెం సమీపంలోని అండర్ బ్రిడ్జిని వెడల్పు చేసి బ్రిడ్జి నుంచి హైవే రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజా రవాణాను మెరుగుపరచాలని కోరుతున్నారు. కాజీపేట- బల్హరా మీదుగా వెళ్తున్న రైల్వే జీఎంకు బెల్లంపల్లిలో వినతి పత్రం అందించనున్నామని గ్రామస్థులు వెల్లడించారు.