Barbarik | ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. పెద్ద హీరో సినిమా అయినా కథ బలంగా లేకపోతే పట్టించుకోవడం లేదు. అదే సమయంలో, యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇటీవల విడుదలైన ఓ చిన్న సినిమాకి మాత్రం ఆడియెన్స్ లభించకపోవడం దర్శకుడికి తీవ్ర నిరాశను కలిగించింది. శుక్రవారం విడుదలైన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రానికి క్రిటిక్స్ ప్రశంసలు లభించినా, థియేటర్లలో మాత్రం ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉంది. ఈ సినిమా దర్శకుడు మోహన్ శ్రీవత్స ఈ పరిస్థితిని చూసి సహనం కోల్పోయాడు. మీడియా ముందుకు వచ్చి తన బాధను పంచుకున్నాడు.
థియేటర్‌కి వెళ్లాను. కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. వాళ్లకు నేను దర్శకుడినని తెలియదు. కానీ సినిమా బాగుందని హగ్ చేసుకున్నారు. సినిమా నచ్చితే ఈ స్థాయిలో స్పందిస్తే, మరి మిగతా వారు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు అని భావోద్వేగంతో అన్నాడు మోహన్. తాను ఈ సినిమాకు రెండున్నరేళ్లు రోజూ కష్టపడినట్లు చెప్పిన మోహన్ శ్రీవత్స, తన భార్య కూడా సినిమా చూసి మళ్లీ మధ్యలో ఇంటికి వచ్చేసిందని చెప్పాడు.ఆమె భావోద్వేగంగా ఉందని చెప్పింది. సినిమా నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటా అని సవాల్ చేసాను. కానీ ఇప్పుడు ప్రేక్షకులే రావడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
తెలుగు ప్రేక్షకులు పరభాషా సినిమాలకే ఆదరణ చూపిస్తున్నారు. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీకి వెళ్లాలని ఉంది. అక్కడ సినిమా తీసి, తెలుగోడు సినిమా అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను,” అని తన బాధను వ్యక్తం చేశాడు మోహన్.కాగా, కొద్ది రోజుల క్రితం మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ, “సినిమా నచ్చకపోతే ఓకే, తిడితే ఓకే, కానీ అసలు చూడకుండా విమర్శిస్తే ఎంత బాధగా ఉంటుంది! అని ఆవేదన వ్యక్తం చేశాడు. నా సవాల్ సమాధానంగా నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా అని చెప్పుతో కొట్టుకున్నాడు దర్శకుడు మోహన్ శ్రీవత్స. దీనికి సంబంధించిన వీడియో విడుదల చేయగా, ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.