Tollywood Hero | హీరో నాగ శౌర్య వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. చివరిసారిగా 2023లో విడుదలైన రంగబలి సినిమాలో వెండితెరపై కనిపించారు. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. త్వరలోనే వీటితో తిరిగి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. పోలీస్ వారి హెచ్చరిక, బాయ్ బాయ్ కార్తీక్, నారీ నారీ నడుమ మురారీ అనే సినిమాల్లో నటిస్తున్నారు నాగ శౌర్య. ఈ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. వృత్తి పరంగా బిజీగా ఉన్న నాగశౌర్య తాజాగా వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర పరిణామాలతో వార్తల్లో నిలిచారు. 2022 నవంబర్‌లో బెంగళూరుకు చెందిన అనుషా శెట్టిని వివాహం చేసుకున్న నాగ శౌర్య, కొద్దికాలంలోనే తండ్రయ్యారు.
గత ఏడాదే ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. నవంబర్‌లో ఆమె మొదటి పుట్టిన రోజు కూడా గ్రాండ్‌గా జరిపినట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లయ్యాక తల్లి తండ్రులతో కాకుండా వేరే ఇంట్లో కాపురం పెట్టారని నాగ శౌర్య తల్లి ఉషా ముల్పురి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.నాగ శౌర్య చిన్నప్పుడే, పెళ్లయ్యాక కలిసుండను అని చెప్పేవాడు. ‘ఇద్దరు మంచివాళ్లు ఒకేచోట ఉండకూడదు’ అనే నమ్మకం అతనిదని అన్నారు. అందుకే ఇప్పుడు శౌర్య, అనుషా వేరే ఇంట్లో ఉంటున్నారు,” అని చెప్పారు ఉషా. తన కొడుకు, కోడలు వేరుగా ఉండటం తనకు ఎంతగానో బాధ కలిగిస్తోందని ఎమోషనల్‌గా చెప్పారు ఉషా.
నాకు ఇద్దరు కొడుకులు.. చిన్నప్పుడు వాళ్లిద్దరికీ ఆస్తమా ఉండేది. అందుకే స్కూలుకు పంపించకుండా ఇంట్లోనే చదివించేదాన్ని. రోజంతా వాళ్లతో గడిపేదాన్ని. ఇప్పుడు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుని వేరుగా ఉండిపోవడంతో ఇల్లు బోసిపోయినట్లు అనిపిస్తోంది,” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.తన వ్యక్తిగత వ్యధను పంచుకున్న ఉషా ముల్పురి, ప్రస్తుతం ఫిల్మ్ ప్రొడక్షన్‌తో పాటు రెస్టారెంట్ బిజినెస్‌లోనూ చురుకుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్‌లో ఆమెకు పలు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుతం తన కొత్త సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న నాగ శౌర్య, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించనున్నారు. సక్సెస్ఫుల్ కమ్‌బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ముందుకెళ్తున్న ఈ యంగ్ హీరోని అభిమానులు కూడా చాలానే మిస్ అవుతున్నారు.