Krish | తెలుగు సినిమా ఇండస్ట్రీలో “గమ్యం”, “వేదం”, “కృష్ణం వందే జగద్గురుం”, “కంచె”, “గౌతమీ పుత్ర శాతకర్ణి”, “కొండ పొలం” వంటి వైవిధ్యభరిత చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, కొంత విరామం తర్వాత మరో ప్రత్యేకమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. “ఘాటి” అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. చింతకింది శ్రీనివాసరావు రాసిన కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించారు. చైతన్య రావు, జిషు సేన్‌గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, దేవికా ప్రియదర్శిని, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ‘ఘాటి’ సినిమాను ప్రమోట్ చేయడానికి చిత్రబృందం తాజాగా విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ క్రిష్‌తో పాటు నటులు విక్రమ్ ప్రభు, జగపతిబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా పర్సన్ ఒకరు “హరిహర వీరమల్లు” ప్రాజెక్ట్‌పై ప్రశ్నించగా, క్రిష్ స్పందిస్తూ, పవన్ కల్యాణ్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ ఉంది. నిర్మాత ఎ.ఎం.రత్నంపై గౌరవం ఉంది. ఆయన నిర్మించిన సినిమాల పోస్టర్లు చూసే నేను సినిమాలకి ఆకర్షితుడినయ్యాను. ‘హరిహర వీరమల్లు’లో కొంతభాగం నేను తెరకెక్కించాను. కానీ కోవిడ్ ప్రభావం, వ్యక్తిగత కారణాలతో షూటింగ్ షెడ్యూళ్లు మారాయి. అందుకే నేను ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను. ఆ తర్వాత ఆ సినిమా చిత్రీకరణను జ్యోతికృష్ణ కొనసాగించారు అని వివరించారు.
ఇక జులై 24న విడుదలైన ‘హరిహర వీరమల్లు’ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్‌ను అందుకుంది. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం క్రిష్ తన ఫోకస్‌ను పూర్తిగా ‘ఘాటి’ సినిమా మీదే పెట్టారు. కథాంశం, విజువల్స్, నటీనటుల ప్రతిభ అన్నీ కలిసొచ్చే ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. . గంజాయి మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథను మహిళ దృక్కోణంలో చూపించారు. అలా చెబితేనే భావోద్వేగాలు మరింత బలంగా పండుతాయని భావించి అనుష్కను ఎంచుకున్నట్లు క్రిష్ చెప్పుకొచ్చారు. అనుష్క స్టార్డమ్, ఆమె గ్రేస్ సినిమా స్థాయిని మరింత పెంచుతాయని క్రిష్ పేర్కొన్నారు. .