Adani Power | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: గత ప్రధాని హసీనా హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సమీక్ష చేస్తున్నది. అందులో భాగంగా అప్పట్లో అదానీ గ్రూప్‌తో జరుపుకున్న విద్యుత్తు ఒప్పందాన్ని నిశితంగా పరిశీలించాలని మహమ్మద్ యూనస్ ప్రభుత్వం నిర్ణయించింది. బంగ్లా రాజధాని ఢాకాకు తమ జార్ఖండ్ యూనిట్ నుంచి విద్యుత్తు సరఫరాకు 2017లో అదానీ సంస్థ చేసుకున్న ఒప్పందాన్ని పూర్తిగా పరిశీలిస్తారు. ‘రెండు దేశాలు ఎలాంటి కాంట్రాక్టులపై సంతకాలు చేశాయి?, వాటి నిబంధనలు, నియమాలు ఏమిటి? తాము పొందుతున్న సేవలకు చెల్లిస్తున్న ధర సరైనదేనా? ఇప్పటివరకు ఈ ఒప్పందంలో భాగంగా అదానీ సంస్థలకు ఎంత చెల్లించారు? తదితర అంశాలన్నీ నిశితంగా పరిశీలిస్తాం.
మా దేశ చట్టాలను ఉల్లంఘించే ఏ విదేశీ సంస్థ ఉండకూడదు’ అంటూ ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. అలాగని తాము ఏ ఒక్క భారత సంస్థను టార్గెట్ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. 25 ఏండ్ల పాటు 1,496 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు అదానీ పవర్ (జార్ఖండ్) లిమిటెడ్‌కు బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు మధ్య 2017 నవంబర్‌లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అదానీ జార్ఖండ్ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే నూరు శాతం విద్యుత్తును బంగ్లా కొనుగోలు చేస్తుంది. ఇది బంగ్లాదేశ్ బేస్ లోడ్‌లో 7-10 శాతం. కాగా, గత ఏడాది అదానీ సంస్థ 7,508 మిలియన్ యూనిట్ల విద్యుత్తును బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేసింది.