Tarique Rahman : బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) యాక్టింగ్ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ (Tarique Rahman) స్వదేశానికి తిరిగివచ్చారు. సుమారు 17 ఏళ్లపాటు లండన్ నుంచి పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించిన ఆయన.. కుటుంబంతో కలిసి ఇవాళ ఢాకా (Dhaka) లో అడుగుపెట్టారు. ఆయన రాక నేపథ్యంలో ఢాకా విమానాశ్రయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తారిఖ్ రాకను ఆ పార్టీ కార్యకర్తలు సెకండ్ ఇన్నింగ్స్‌గా అభివర్ణిస్తున్నారు.
వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే భారత్‌తో సంబంధాలు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది. షేక్ హసీనా నాయకత్వంలోని బంగ్లాదేశ్‌తో భారత్‌కు సత్సంబంధాలు ఉండేవి. ఆమె పదవీచ్యుతురాలు అయ్యాక ఢిల్లీలో తలదాచుకున్నారు. కానీ తాత్కాలిక యూనస్ ప్రభుత్వంతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్థాన్‌కు దగ్గరవుతోంది.
ఈ క్రమంలో త్వరలో జరగబోయే జనరల్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఆ పార్టీతో భారత్‌కు చెప్పుకోదగిన సంబంధాలు లేకపోయినప్పటికీ, దానిని భారత్ ఒక ప్రజాస్వామ్య పార్టీగా పరిగణిస్తోంది. ఆ పార్టీతో భారత్ సత్సంబంధాలు పునరుద్ధరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా తారిఖ్ రెహమాన్ తల్లి ఖలీదా జియా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆమె ఆరోగ్యంపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేయగా.. దానిని బీఎన్పీ సానుకూలంగా స్వీకరించింది. అంతేకాదు ప్రస్తుత యూనస్ ప్రభుత్వం విధానాలను రెహమాన్ వ్యతిరేకిస్తున్నారు. జమాత్-ఇ-ఇస్లామీతో పొత్తుకు కూడా రెహమాన్ సుముఖంగా లేరు. జమాత్-ఇ-ఇస్లామీ పాకిస్థాన్ ఐఎస్ఐకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే వాదనలు ఉన్నాయి. అందుకే షేక్ హసీనా హయంలో ఈ సంస్థపై నిషేధం విధించారు.
యూనస్ ప్రభుత్వం వచ్చాక ఆ సంస్థ మళ్లీ క్రియాశీలకంగా మారింది. భారత్, పాకిస్థాన్‌లకు రెహమాన్ సమదూరం పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఢిల్లీ కాదు, రావల్పిండి కాదు, బంగ్లాదేశ్ తర్వాతే ఎవరైనా’ అని తారిఖ్ రెహమాన్ అన్నారు. అయితే యూనస్ మాత్రం పాకిస్థాన్‌కు దగ్గరగా ఉంటూ, భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.