హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తమ కడుపుకొట్టే సాగుచట్టాలపై రైతన్నల మొక్కవోని ఉద్యమ దీక్షకు ప్రపంచమే అబ్బురపడింది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఎముకలు కొరికే చలికి గడ్డకట్టిపోతూ తమ ఉచ్ఛ్వాస నిస్వాలతోనే ఉద్యమానికి ఊపిరులూదిన అన్నదాతలు ప్రజాస్వామ్య పోరాటాల్లో ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని చూపారు. అయినా అధికార బీజేపీ నేతల అహంకారం మాత్రం తగ్గలేదు. ఉద్యమంలో అమరులైన రైతులను కూడా వదలటంలేదు. మరణించినవారిపట్ల అనుచితంగా ప్రవర్తించకూడదన్న కనీస బుద్ధిలేకుండా ఉద్యమ రైతులు ఉగ్రవాదులని, దేశద్రోహులని అవాకులు చవాకులు పేలుతున్నారు. బీజేపీ నేత ఏ చంద్రశేఖర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ‘ఇటీవల దేశ సరిహద్దుల్లో చైనా చర్యల గురించి మాట్లాడిన సీఎం కేసీఆర్, ఇప్పుడు ఖలిస్థాన్ ఉద్యమకారులకు ఎక్స్గ్రేషియా ఇస్తానని ప్రకటించారు’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దేశద్రోహిగా మారిపోయారని సాక్షాత్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలోనే అనుచితంగా మాట్లాడారు.
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): మనదేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందని చిన్న పిల్లాడిని అడిగినా 1947 ఆగస్టు 15న టక్కున చెప్తారు. కానీ ఓ జాతీయపార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ మాత్రం భారతదేశానికి 1940 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని సెలవిచ్చారు. సాగు చట్టాల రద్దు అంశంపై కార్యకర్తలతో ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతూ ‘మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది 15 ఆగస్టు 1940 అని చెప్పుకొంటాం. కానీ రైతులకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది మాత్రం పార్లమెంట్లో నూతన వ్యవసాయ చట్టాలు ఆమోదించిన 26 సెప్టెంబర్ 2020 రోజునే’ అని అన్నారు. దీంతో బీజేపీ అధ్యక్షుడిని నెటిజన్లు ఓ ఆడుకుంటున్నారు. ‘దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందో తెలియని నువ్వు ఒక ఎంపీవా?’ అని మండిపడుతున్నారు.