కరీంనగర్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు, టీ న్యూస్ చానెల్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన అక్కసు వెళ్లగక్కారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాయలేని భాషలో ఈ ప్రసార సాధనాలను దూషించారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్‌లు అవాస్తవాలను ప్రసారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మూడు సమాచార సాధనాల గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్న ఆయన.. ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ పత్రికలపై చర్యలు తీసుకోవాల్సిందే, ముఖ్యమంత్రి దిగి రావాల్సిందే అంటూ బండి సంజయ్ బెదిరింపులకు దిగారు.