అమీర్‌పేట్, జూలై 9 : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన వేదికపై అమ్మవారు ఆసీనులు కాగా అశేష సంఖ్యలో భక్తులు తిలకిస్తుండగా ఎల్లమ్మ వారు.. జమదగ్ని మహర్షిని (త్రిశూల రూపం) వివాహమాడారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున నగరవాసులు హాజరయ్యారు. ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లు తలంబ్రాలు, పట్టు వస్ర్తాలను సమర్పించారు. ఆలయ వేద పండితులు అమ్మవారి కల్యాణ ఘట్టాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తూ కల్యాణ క్రతువును నిర్వహించారు. కల్యాణోత్సవానికి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్‌కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, శ్రీగణేశ్, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రధాన కార్యదర్శి శరత్, దేవాదాయ కమిషనర్ ఎం.హనుమంతరావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కార్పొరేటర్ కేతినేని సరళ సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, అధికార, అనధికార ప్రముఖులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణాన్ని తిలకించేందుకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల ఆకలి తీర్చేందుకు బల్కంపేట వాసులు అడుగడుగునా అన్నప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నిర్వహణ లోపంతో
ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ఈ సారి నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనబడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, వీవీఐపీలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. క్యూలైన్లలో విపరీతమైన రద్దీ పెరిగిపోవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మికి స్వాగతం పలికేందుకు అధికారులు అందుబాటులో లేకుండా పోయారు. మరోవైపు వీరిద్దరిని పోలీసులు లోపలికి తీసుకు వెళ్లేందుకు యత్నించగా ప్రత్యేక టికెట్లు ఉన్న భక్తులు కూడా దూసుకురావడంతో పొన్నం కుదుపునకు గురికాగా మేయర్ విజయలక్ష్మి కిందపడిపోయారు. కాగా కలెక్టర్ అనుదీప్ వీరిని బుజ్జగించి శాంతింపజేశారు. కాగా గత దశాబ్ద కాలంగా ఎలాంటి చెదురుమదురు ఘటనలు లేకుండా సాగుతూ వచ్చిన ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ఈ సారి మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పర్యవేక్షణ లేకపోవడంతో ఆ లోటు స్పష్టంగా కనబడింది.