హైదరాబాద్, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): ‘లగచర్లలో గిరిజనులపై పోలీసులు అర్ధరాత్రి వేళ విచక్షణారహితంగా దాడి చేశారన్నది వాస్తవం. కొంతమంది పోలీసులు మద్యం మత్తులో ఇండ్లలోకి చొరబడి మహిళలని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్టు కొట్టారని అక్కడి గిరిజన రైతులు, మహిళలు మాతో చెప్పారు. బూటుకాళ్లతో చెప్పుకోలేని చోట తన్నారని కూడా మహిళలు విలపించారు’ అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చెప్పారు. లగచర్లలో భయానక పరిస్థితులు ఉన్నాయని వివరించారు. గిరిజన రైతులు ఎప్పుడేం జరుగుతుందోనని తీవ్ర భయాందోళనలో ఉన్నారని, భూమిలిచ్చేందుకు సిద్ధంగా లేమని చెప్తున్నారని తెలిపారు. అక్కడి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి నివేదించాలని కలెక్టర్‌ను ఆదేశించామని వివరించారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి కూడా ఎస్సీ, ఎస్టీ కమిషన్ తీసుకెళ్లాలని నిర్ణయించిందని వెల్లడించారు. ఇటీవల లగచర్ల గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాలను తమ కమిషన్ సందర్శించిందని, సంగారెడ్డి జైల్లో ఉన్న గిరిజన రైతులను స్వయంగా వెళ్లి కల్సిందని, క్షేత్రస్థాయి పరిశీలనలో విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. తమ పరిశీలనకు వచ్చిన విషయాలను ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బక్కి వెంకటయ్య వివరించారు.
తీవ్రమైన భయానక పరిస్థితులు ఉన్నాయి. లగచర్లతోపాటు రోటిబండ, పులిచర్లకుంటతండాల్లోని గిరిజన రైతులు, ఆడబిడ్డలు, స్థానికులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏ రాత్రికి ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. ప్రాణాలు పోయినా పంట భూములను ఇవ్వబోమని తెగేసి చెప్తున్నారు. రైతులే కాదు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత గురునాథ్‌రెడ్డి కూడా ఇక్కడ ఫార్మాసిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నరు. ‘అవసరమైతే వేరేచోట భూములున్నాయని, అక్కడ కంపెనీలు ఏర్పాటుచేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పినా వినడంలేదు’ అని ఆయన చెప్తున్నారు. ఇదే విషయాన్ని స్థానికులు కమిషన్‌కు కూడా చెప్పారు.
మేం లగచర్లలో పర్యటించిన సందర్భంలో అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నట్టు గుర్తించినం. కలెక్టర్, అధికార యంత్రాంగంపై దాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించడంలేదు. కానీ, ఈ నెపంతో అమాయక గిరిజనులపై దాడులకు పాల్పడటం సరికాదు. వందలాది పోలీసులు అర్ధరాత్రి గిరిజనగూడేలపై ఎందుకు దాడి చేశారన్నదే మా ప్రశ్న. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదు. పోలీసులు తమ పరిధికి మించి ప్రవర్తించినట్టు కనిపిస్తున్నది. లగచర్లలో ఆందోళన జరిగిన రోజు ఆ ఘటనతో సంబంధంలేని వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు మా కమిషన్ పరిశీలనలో వెల్లడయ్యింది. ప్రభుత్వం 2013 చట్ట ప్రకారం భూ సేకరణ చేయాలి. రైతులను ఒప్పించి, మెప్పించి భూములు తీసుకోవాలె. బలవంతంగా సేకరించడం కరెక్ట్ కాదు. ఇదే విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వానికి వివరించి, చేపట్టాల్సిన చర్యలపై తగిన సిఫారసులు చేస్తాం.
పోలీసులు గిరిజనులను కొట్టినట్టు తేలింది. గిరిజనుల ఆరోపణలు నిజమే. దాదాపు 20 రోజుల క్రితం అర్థరాత్రి వేళ పోలీసులు గిరిజనతండాలపై దాడులు చేశారు. ఫార్మా కంపెనీకి భూములివ్వబోమని చెప్పిన వారితోపాటు సంబంధంలేని వారిని కూడా తీవ్రంగా కొట్టారు. మద్యం మత్తులో ఉన్న కొందరు పోలీసులు మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా చితకబాదారు. యువకులను దారుణంగా హింసించారు. బూటు కాళ్లతో ఇష్టమొచ్చినట్టు తన్నారు. కొందరు గాయపడ్డారు. వారు తమకు తగిలిన గాయాలను కూడా మాకు చూపించారు. ఇది ఉపేక్షించలేని విషయం. డీజీపీని, సంబంధిత పోలీసు అధికారులను కూడా దీనిపై వివరణ కోరుతాం.
లగచర్లలో భయాందోళనకర వాతావరణం నెలకొని ఉన్నది. కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనతో సంబంధంలేని వారిని కూడా పోలీసులు నిర్బంధించినట్టు ఆడబిడ్డలు చెప్పిన్రు. అక్రమంగా పోలీసులు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరిన్రు. వెంటనే అక్కడినుంచి కలెక్టర్‌తో మాట్లాడి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించినం. అమాయకులను వెంటనే విడుదలచేసేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీజీ, ఎస్పీ, పోలీసు అధికారులకు సూచించినం. బెయిల్ మంజూరుకోసం సాయం చేయాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినం. నిరపరాధులపై కేసులు పెట్టడం సరికాదు.
అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఉన్నదిఉన్నట్టుగా నివేదించాలని వికారాబాద్ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినం. అమాయకులకు బెయిల్ వచ్చేలా చర్యలు చేపట్టాలని ఎస్పీకి కూడా సూచించినం. ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించినం. వారు నివేదిక సమర్పించిన తర్వాత మా పరిశీలనలో తేలిన అంశాలపై నివేదికను సిద్ధంచేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నివేదిక ఇస్తాం. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అక్కడి రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ భూములిచ్చేందుకు సిద్ధంగా లేరనే విషయాన్ని స్పష్టంగా చెప్తాం. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచిస్తాం.
అక్కడి రైతులను కలిసిన సందర్భంలో వారు తమ ఆవేదనను, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి సరిపెట్టాలని అనుకుంటున్నదని, కానీ, తాము వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇవ్వబోమని చెప్తున్నదని బాధితులు చెప్పారు. వారి ఆవేదనలో కూడా అర్థం ఉన్నది. వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పినం. మీ భూములను ఎవరూ గుంజుకోరని, ఆందోళనకు గురికావద్దని ధైర్యం చెప్పినం. మీకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని భరోసానిచ్చినం.
సోమవారం లగచర్లకు వెళ్లిన సందర్భంలో రైతులతోపాటు గిరిజన మహిళలను కలిసినం. ప్రభుత్వం ఏం చేసినా భూములివ్వబోమని తేల్చిచెప్తున్నరు. అమాయకులైన తమ భర్తలు, కొడుకులను అన్యాయంగా జైల్లో పెట్టారని గోడు వెళ్లబోసుకున్నారు. తమకున్న ఎకరం, అర ఎకరం భూమిని ప్రభుత్వం తీసుకుంటే తమ పరిస్థితేమిటని, తమ జీవనాధారం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో తాము రాష్ట్రంలో ఎక్కడా భూమి కొనుక్కోలేమని, ఇప్పుడు రైతులుగా ఉన్న తాము కూలీలుగా మారాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుకు, భూమికి మధ్య ఉండే పేగుబంధాన్ని తెంపడం సరికాదు.