హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: వెన్ను సంబంధ సమస్యలకు అవసరమైన అన్ని చికిత్సలు ఏషియన్ స్పైన్ హాస్పిటల్లో లభిస్తాయని ఏఐజీ దవాఖాన చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. వెన్ను సంరక్షణ కోసం పూర్తిస్థాయి చికిత్సలు అందించే దవాఖానను దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నెలకొల్పడం గర్వకారణమని చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నూతనంగా నెలకొల్పిన ఏషియన్ స్పైన్ హాస్పిటల్‌ను ఆదివారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్పైన్ శస్త్రచికిత్సలు చేయడంలో 15 ఏండ్ల అనుభం ఉన్న డాక్టర్ సుకుమార్, మెడికల్ టెకీగా పేరొందిన పడిగిమర్రి నగేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్న ఈ దవాఖాన వల్ల వెన్ను సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఎండోస్కోపిక్ ద్వారా అత్యాధునిక పద్ధతిలో స్పైన్ శస్త్రచికిత్సలు చేయడం రోగులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ హాస్పిటల్లో వెల్నెస్ సెంటర్, యోగా, ఫిజియోథెరపీ తదితర అన్నిరకాల సేవలను అందించడం అభినందనీయమని ప్రశంసించారు.
ఏషియన్ స్పైన్ దవాఖాన సీఎండీ డాక్టర్ సూర సుకుమార్ మాట్లాడుతూ.. తాము పూర్తిస్థాయి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలను నిర్వహిస్తామని చెప్పారు. దీనివల్ల రోగి త్వరగా కోలుకోవడమే కాకుండా ఓపెన్ సర్జరీ మాదిరిగా నొప్పి ఉండదని వివరించారు. వెన్నుముక, వెన్ను, మెడకు సంబంధించిన క్లిష్టమైన సమస్యలకు సైతం పూర్తిస్థాయి చికిత్స అందస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైద్యనిపుణులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.