Summer Heat | దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్న నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖతోపాటు ఆరోగ్య సేవల విభాగం ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. తీవ్రమైన ఎండల ప్రభావం వల్ల డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాస్షన్, కండరాల పట్టేయడం, మూర్ఛ, తీవ్రమైన పరిస్థితుల్లో హీట్‌స్ట్రోక్ వంటి ప్రాణాపాయ సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరించింది. ముఖ్యంగా తలనిర్భంధం, వాంతులు, తలనొప్పి, గందరగోళం, వేగంగా గుండె కొట్టుకోవడం, గాఢ పసుపు రంగు మూత్రం, అపస్మారక స్థితి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించింది. వేసవిలో దాహం వేయకపోయినా తరచూ నీరు తాగడం చాలా ముఖ్యమని సూచించింది. దాహం లేకపోవడం అంటే శరీరానికి నీరు అవసరం లేదని కాదని స్పష్టం చేసింది. శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఇంట్లో తయారు చేసే సంప్రదాయ పానీయాలను తీసుకోవాలని సూచించింది.
చాస్, లస్సీ వంటి పానీయాలు వేసవిలో శరీరాన్ని చల్లబరచడంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపింది. ఇవి శరీరానికి తేమను అందించడమే కాకుండా జీర్ణక్రియకు కూడా సహాయపడతాయని పేర్కొంది. కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్స్తో నిండిన ఉత్తమ పానీయంగా పేర్కొంది. ఇది శరీరంలో కోల్పోయిన ఖనిజాలను తిరిగి భర్తీ చేయడంలో సహాయపడుతుందని తెలిపింది. నిమ్మరసం వేసవిలో అత్యంత సులభమైన, ప్రభావవంతమైన పానీయమని సూచించింది. కొద్దిగా ఉప్పు కలిపి తీసుకుంటే శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుందని పేర్కొంది. సత్తు పానీయం కూడా వేసవిలో శక్తిని ఇచ్చే చల్లని పానీయంగా సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగించే ఈ పానీయం శరీర వేడిని తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపింది. అలాగే ఆమ్ పన్నా శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చెమట ద్వారా కోల్పోయిన లవణాలను భర్తీ చేస్తుందని పేర్కొంది. హీట్ ఎగ్జాస్షన్ నివారణలో ఇది ఉపయోగకరమని తెలిపింది. బేల్ శర్బత్ను సహజ శీతల పానీయంగా వివరించింది. ఇది శరీరానికి చల్లదనాన్ని అందించడంలో సహాయపడుతుందని పేర్కొంది.
ఇక దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన నన్నారి పానకం కూడా వేసవిలో ఉపయోగకరమైన పానీయమని తెలిపింది. నన్నారి సిరప్, నిమ్మరసం, సబ్జా గింజలు కలిపి తయారుచేసే ఈ పానీయం శరీరాన్ని తాజాగా ఉంచుతుందని పేర్కొంది. మజ్జిగలో ఉసిరికాయ, కరివేపాకు, అల్లం, సేంద్రీయ ఉప్పు కలిపి తయారు చేసే గూస్బెర్రీ బటర్‌మిల్క్ కూడా శరీరానికి చల్లదనాన్ని అందిస్తుందని సూచించింది. వేసవిలో ఎక్కువ నీటి శాతం ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచించింది. పుచ్చకాయ శరీరాన్ని వెంటనే చల్లబరచడంలో సహాయపడుతుందని తెలిపింది. తర్బూజా కూడా శరీరానికి తేమను అందించే ఉత్తమ పండుగా పేర్కొంది. దోసకాయను సలాడ్, రైతా లేదా నేరుగా ఉప్పుతో తీసుకోవచ్చని, ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపింది.
ద్రాక్షలో సహజ చక్కెరలు, నీటి శాతం అధికంగా ఉండటంతో శక్తిని నిలబెట్టడంలో ఉపయోగపడుతుందని పేర్కొంది. కొబ్బరి బొండంలోని మృదువైన తురుము కూడా శరీరానికి చల్లదనాన్ని అందించే పోషకాహారంగా సూచించింది. బూడిద గుమ్మడికాయను ఆయుర్వేదం, సిద్ధ వైద్యంలో చల్లదనాన్ని ఇచ్చే ఆహారంగా భావిస్తారని తెలిపింది. దీన్ని వంటల్లో లేదా పానీయాల రూపంలో తీసుకోవచ్చని సూచించింది. టమాటాలు, లెట్యూస్ వంటి నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలను తేలికపాటి ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించింది. అలాగే తీవ్రమైన ఎండల సమయంలో మద్యం, అధిక టీ, కాఫీ, కార్బొనేటెడ్ శీతల పానీయాలు, అధిక చక్కెర కలిగిన డ్రింక్స్, ఎక్కువ నూనెతో చేసిన వంటకాలు, అధిక ప్రోటీన్ ఆహారాలను తగ్గించాలని హెచ్చరించింది. ఇవి శరీరంలో వేడిని పెంచి డీహైడ్రేషన్ సమస్యను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని తెలిపింది. సాంప్రదాయ భారతీయ వేసవి ఆహారాలు, పానీయాలు ప్రస్తుత కాలంలో మరింత అవసరమని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.