మధిర, ఏప్రిల్ 07 : ఆయుష్ శాఖలో 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న కాంపౌండర్ లను రెగ్యులర్ చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయుష్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల రాంబాబు కోరారు. సోమవారం మధిరలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి 28న విడుదల చేసిన 65 జీఓని సవరించాలన్నారు. ఆయుష్ ఉద్యోగులకు ఈ జీఓ గుదిబండగా మారిందన్నారు. 20 సంవత్సరాల క్రితం అప్పటి జీఓ ప్రకారం ఆయుష్ శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా 59 మంది ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వారు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఒక సంవత్సరం సర్టిఫికెట్ కోర్సును కూడా పూర్తి చేసినట్లు చెప్పారు. ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా 20 సంవత్సరాలుగా ట్రెజరీ ద్వారా జీతాలు తీసుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
కాగా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీఓలో కాంట్రాక్ట్ ఆయుర్వేద కాంపౌండర్లకు బీఫార్మసీ, డి ఫార్మసీ ఉండాలనే నిబంధన తెచ్చిందన్నారు. ఈ జీఓను 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఆయుష్ కాంట్రాక్టు కాంపౌండర్లకు వర్తింపజేయాలని చెప్పటం ప్రభుత్వ ఉద్యోగ సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకమన్నారు. ఏ ప్రభుత్వం అయినా కొత్తగా జీఓ తీసుకువస్తే చేపట్టబోయే నియామకాలకు ఆ నిబంధనను వర్తింపజేస్తారన్నారు. 65 జీఓ అనేక లోపాలతో ఉందన్నారు. దీనిపై మరోసారి పరిశీలన చేయాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఎన్ ఎమ్ ఓ లు, ఎస్ ఎన్ ఓ లు, అన్ని రకాల అర్హతలు ఉండి ఇంతవరకు ప్రమోషన్లు పొందలేదన్నారు. క్లాస్ ఫోర్ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించి 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఆయుష్ కాంపౌండర్లను రెగ్యులర్ చేయాలని, కొత్తగా తీసుకునే వారికే 65 జీఓని వర్తింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు.