హైదరాబాద్: క్వీన్ ఆఫ్ మెలోడీ.. నైటింగేల్ ఆఫ్ ఇండియా.. స్వర కోకిల.. ఎలా పిలిచినా ఆమె గానం సుమధురమే.
హిందీ పాటలతో యావత్ దేశాన్ని ఊర్రూతలూగించింది ఆమె తీయని స్వరం.
దేశభక్తి గీతమైనా.. ప్రణయ రాగమైనా.. భావోగ్వేద పాటైనా.. లతా మంగేష్కర్ పాడితే అది అజరామరమే.
యే మేరే వతన్ కే లోగో అంటూ లతాజీ పాడిన దేశభక్తి గీతం ఎవర్గ్రీన్.
ఆ పాటలోని స్వరం దేశ ప్రజల్లో నింపిన చైతన్యం అనన్యం..
తేనలూరే తన గొంతుతో మంగేష్కర్ యువతలో దేశ భక్తిని రగిలించిన తీరు అపూర్వం..
ఇండియా, చైనా మధ్య 1962లో జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ పాటను రాశారు. ఆ తర్వాత ఈ పాట ప్రతి ఒక్క భారతీయుడిలో జాతీయ భావాన్ని నింపింది. ఈ పాటను లతా మంగేష్కర్ 1963, జనవరి 27వ తేదీ ఢిల్లీలోని స్టేడియంలో అప్పటి ప్రధాని నెహ్రూ, రాష్ట్రపతి రాధాకృష్ణన్ సమక్షంలో ఆమె పాడారు. స్వచ్ఛమైన దేశభక్తి కలిగిన ఎవరైనా లతా మంగేష్కర్ స్వరానికి దిగ్భంధం కావాల్సిందే అని నెహ్రూ అన్నారు.
ఇండో సైనో వార్ వితంతువుల ఫండ్ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. సీ రామచంద్ర ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఆరున్నర నిమిషాల పాటు ఈ సాంగ్ ఉంటుంది. అయితే తొలి సారి స్టేడియంలో ఈ పాట విన్న నెహ్రూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సాంగ్‌ను రాసింది కవి ప్రదీప్. ఈ పాటను రాయడానికి దారితీసిన పరిస్థితుల్ని ఓ సందర్భంలో కవి ప్రదీప్ వివరించారు. ముంబైలోని మహిమ బీచ్‌లో నడుస్తున్న సమయంలో తనకు ఆ ఆలోచన వచ్చినట్లు అతను చెప్పాడు. సిగరేట్ డబ్బలో ఉండే అల్యూమీనియం ఫాయిల్‌పై తాను తొలిసారి యే మేరే వతన్ కే లోగో లైన్స్ రాసినట్లు చెప్పాడు. నిజానికి ఈ పాట కోసం తొలుత ఆశా భోంస్లేను కూడా సెలెక్ట్ చేశారు. కానీ చివరలో అనూహ్య మలుపుల తర్వాత లతా మంగేష్కర్ ఈ పాటకు ఫిక్స్ అయ్యారు.