న్యూఢిల్లీ, మార్చి 22: ఐటీ, టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ మరో అంతర్జాతీయ సంస్థను ఆకర్షించింది. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ అక్స్ట్రియా త్వరలో 500 మంది ఉద్యోగులతో భాగ్యనగరంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సంస్థకు న్యూజెర్సీ, న్యూఢిల్లీ-ఎన్సీఆర్ల్లో రెండు కేంద్రాలు ఉండగా, ఇటీవల బెంగళూరులో ఒక కేందాన్ని నెలకొల్పింది. తాము త్వరలో హైదరాబాద్, పుణెల్లో కొత్త డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కోదానిలో 500 మందిని నియమిస్తామని అక్స్ట్రియా సీఈవో జస్విందర్ చద్దా మంగళవారం చెప్పారు. వచ్చే 2-3 ఏండ్లలో ఇండియాలో తమ సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేస్తామని, ప్రస్తుతం ఇక్కడ సెంటర్లలో 2,000 మంది పనిచేస్తుండగా, ఈ సంఖ్య మూడేండ్లలో 4,000-5,000కు పెరుగుతుందన్నారు.